బిహార్ సీఎంగా తొమ్మిదో సారి నితీశ్ ప్రమాణం

బిహార్ సీఎంగా తొమ్మిదో సారి నితీశ్ ప్రమాణం

పాట్నా: బిహార్​లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆదివారం ఉదయం మహా కూటమి నుంచి బయటికొచ్చిన నితీశ్ కుమార్.. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్​ను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్​కు అందజేశారు. తర్వాత మధ్యాహ్నానికి ఎన్డీఏ కూటమిలో చేరి.. సాయంత్రానికి మళ్లీ గవర్నర్ సమక్షంలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు డిప్యూటీ సీఎంలు బాధ్యతలు స్వీకరించారు. మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు. ఇప్పటిదాకా నితీశ్ తొమ్మిదిసార్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రెండేండ్ల వ్యవధిలోనే రెండు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మహా కూటమి నుంచి బయటికి రావడానికి బలమైన కారణమే ఉందని నితీశ్ చెప్పారు. కూటమిలో పరిస్థితులు సరిగా లేకపోవడంతో బయటికొచ్చినట్లు చెప్పారు.

అందరి అభిప్రాయాల మేరకే..

ఏడాదిన్నరగా బిహార్​లో మహా కూటమి ప్రభుత్వం సరిగ్గా ముందుకు వెళ్లలేకపోయిందని నితీశ్ అన్నారు. గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో వెళ్లాలని అనుకుంటున్నామని చెప్పారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గవర్నర్​కు రాజీనామా లేఖ సమర్పించానని తెలిపారు. బీజేపీ, జేడీయూ, జితన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ అవామీ లీగ్​తో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేస్తామన్నారు. ‘సీట్ల షేరింగ్ త్వరగా కంప్లీట్ చేయాలని అనేక సందర్భాల్లో కోరినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఇండియా కూటమి వద్ద బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ప్రణాళికలు లేవు. గతంలో జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించకుండానే కూటమి పని చేస్తుందని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తుంగలోకి తొక్కారు’ అని నితీశ్ విమర్శించారు.

పదేండ్లలో ఐదు సార్లు సీఎం..

రాజ్​భవన్​లో ఆదివారం సాయంత్రం నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎనిమిది మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలు డిప్యూటీ సీఎంలుగా, ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్, హిందుస్థానీ అవామ్ మోర్చా నుంచి సంతోష్​ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ పదేండ్లలో ఐదుసార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం

నితీశ్​ కుమార్ ఇప్పటిదాకా తొమ్మిది సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గడిచిన పదేండ్లలో ఐదు సార్లు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. చివరి సారిగా 2022లో ఎన్డీఏలో నుంచి బయటికొచ్చిన నితీశ్.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2000లో ఫస్ట్ టైమ్ నితీశ్ సీఎం అయ్యారు. అదేవిధంగా, పదేండ్లలో 8సార్లు యూటర్న్ తీసుకున్నారు. 2013 జూన్​లో బీజేపీకి కటీఫ్ చెప్పారు. 2014లో లోక్​సభ ఎన్నికల్లో జేడీయూ ఓడిపోగా.. సీఎంగా రిజైన్ చేశారు. 2014లో జితన్ రామ్ మాంఝీ సీఎం అయ్యారు. 2015 ఫిబ్రవరిలో మాంఝీతో విభేదాల తర్వాత నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. 2015 జూన్​లో బిహార్​లో నితీశ్, ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా ఏర్పడ్డాయి. జులై 2017లో పొత్తు తెంచుకున్న నితీశ్ ఎన్డీఏలో చేరారు. 2022, ఆగస్టులో నితీశ్ ఎన్డీఏని వదిలి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2024, జనవరిలో మళ్లీ ఆర్జేడీని వదిలి.. బీజేపీతో జతకట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

పొద్దున్నుంచి ఏం జరిగింది?

నితీశ్​ కుమార్ ఆదివారం ఉదయమే గవర్నర్ రాజేంద్ర వద్దకు వెళ్లి సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. గవర్నర్ కూడా వెంటనే రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ సీఎంగా కొనసాగాలని నితీశ్​ను గవర్నర్ కోరారు. మధ్యాహ్నానికి బీజేపీ, జేడీయూ, జితన్‌‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్‌‌ అవామీ లీగ్‌‌ కొత్త కూటమి లో చేరారు. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌‌ను ఎన్నుకున్నారు. మెజార్టీ తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని నితీశ్ గవర్నర్​ను కోరారు. ఆపై సాయంత్రం సీఎంగా నితీశ్, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.