ఆసక్తి లేదని నేనే వద్దన్న..ప్రధాని అభ్యర్థిత్వంపై నితీశ్ కుమార్ కామెంట్​

ఆసక్తి లేదని నేనే వద్దన్న..ప్రధాని అభ్యర్థిత్వంపై నితీశ్ కుమార్ కామెంట్​

పాట్నా : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. తనకు పదవులపై ఆసక్తి లేదని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. సోమవారం మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో నితీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోయిన వారం ఢిల్లీలో ఇండియా కూటమి మీటింగ్ లో జరిగిన చర్చలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని నితీశ్ స్పష్టం చేశారు. 

‘‘నేనేం నిరాశ చెందలేదు. నాకు ఎలాంటి కోపమూ లేదు. మీటింగ్ లో కూటమి నాయకుడు ఎవరనే దానిపై చర్చ వచ్చినప్పుడు.. నాకు ఆసక్తి లేదని చెప్పాను. అప్పుడే మరో పేరు ప్రతిపాదించారు. ఆ పేరు నాకు ఓకే అని చెప్పాను” అని పేర్కొన్నారు. సీట్ల పంపకాలు త్వరగా పూర్తి చేయాలని తాను మీటింగ్ లో ప్రస్తావించానని, సరైన సమయంలో అది పూర్తవుతుందని చెప్పారు. కాగా, ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్ లో మల్లికార్జున ఖర్గేను ప్రధాని అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే దీనిపై నితీశ్ అసంతృప్తిగా ఉన్నారని, ఆయనకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారని వార్తలు వచ్చాయి.  

పార్టీలో గొడవల్లేవ్.. 

జేడీయూలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. జేడీయూలో చీలిక రావొచ్చని, లేదంటే ఆ పార్టీని ఆర్జేడీలో కలిపేస్తారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘‘మా పార్టీలో అందరం కలిసి పని చేస్తున్నాం. మా దృష్టంతా అభివృద్ధిపైనే ఉంది. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం” అని పేర్కొన్నారు.