
- గోదాముల్లో ప్లేస్ కోసం స్పీడ్‌గా కస్టమ్ మిల్లింగ్
- ఏఎంసీ, సింగిల్ విండో గోదాంలపై ఫోకస్
నిజామాబాద్, వెలుగు : యాసంగి వడ్ల నిల్వకు గోదాముల కొరత ఏర్పడడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 252 రైస్ మిల్లులుండగా, 26 మంది మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదు. 157 మిల్లులు వడ్లతో పూర్తిగా నిండిపోయాయి. 69 రైస్ మిల్స్‌లో కూడా ధాన్యాన్ని నిల్వ చేయడానికి జాగా లేదు. 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పెట్టుకోగా, ఇప్పటి వరకు 6.63 లక్షల వడ్లు కొన్నారు. మరో లక్షన్నర టన్నుల వడ్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఎలాంటి సమస్య రాకుండా సివిల్ సప్లయ్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
సర్కార్ కాంటాల వైపే రైతుల మొగ్గు
యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాలో 4.19 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, అధికారులు 11.85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 8 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్న జిల్లా యంత్రాంగం 600 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కాంటాలు ఏర్పాటు చేయక ముందు సుమారు 4 లక్షల టన్నుల పచ్చి వడ్లను ఎంఎస్పీ కంటే తక్కువ రేట్‌కు మిల్లర్లు కొనుగోలు చేశారు. సర్కార్ సన్న వడ్లకు మద్ధతు ధరతో పాటు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతులంతా గవర్నమెంట్ కొనుగోలు సెంటర్లకే వస్తున్నారు. రూ.254 కోట్ల విలువ కస్టమ్ మిల్లింగ్ వడ్లు ఫ్రాడ్ చేసిన 48 రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు వారికి యాసంగి వడ్ల అలాట్మెంట్ చేయలేదు.
ఏప్రిల్ 20 నాటికే 157 రా మిల్లులు వడ్లతో నిండిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో ఎవరేజ్‌గా 44 డిగ్రీల ఎండ నమోదై వడ్లు బాగా ఎండుతున్నాయి. వాటిని రా రైస్ మిల్స్‌లో మిల్లింగ్ చేస్తే నూక శాతం ఎక్కువగా వస్తుంది. దీంతో తీసుకోవడానికి మిల్లర్లు ముందుకురావడం లేదు. గత రెండు సీజన్లలో 1.46 లక్షల టన్నుల ఓల్డ్ స్టాక్ క్లియర్ చేయాల్సి ఉన్నందున 26 మంది రైస్ మిల్లర్లు కొత్త స్టాక్ వద్దని ఆఫీసర్లకు చెప్పేశారు. ఇక మిగిలిన 69 బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించిన వడ్లతో అక్కడా స్థలం 75 శాతం నిండింది. దీంతో మరో మూడు వారాలు కొనుగోలు చేసే లక్షన్నర టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయడం కష్టంగా మారింది.
రెండు రకాల ప్రయత్నాలు
సీజన్ వడ్లు నిలువ చేసేందుకు స్థలం సమస్య రాకుండా సివిల్ సప్లయ్ అధికారులు రైస్ మిల్స్ గోదాముల్లోని 1.46 లక్షల టన్నుల ఓల్డ్ స్టాక్‌ను రైస్‌గా మార్చేందుకు ప్రయార్టీ ఇస్తున్నారు. ప్రతి రోజు గరిష్ఠంగా 5 వేల టన్నుల బియ్యాన్ని అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి పంపుతున్నారు. 5 వేల టన్నుల కెపాసిటీ గల సింగిల్ విండో గోదాంలు, మార్కెట్ కమిటీ గోదాంలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్గోదాంలనూ పరిశీలిస్తున్నారు.
మూడు నెలల దృష్టితో ఏర్పాట్లు
కేవలం 69 బాయిల్డ్ రైస్ మిల్స్‌లో మాత్రమే సీజన్ వడ్లు స్టాక్ పెట్టడానికి కొంత స్థలం ఉంది. వారం పది రోజుల్లో అవి కూడా ఫుల్ అవుతాయి. ఇబ్బంది రాకుండా సింగిల్ విండో, మార్కెట్ కమిటీ గోదాంలు తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. బ్లాక్ లిస్టులో ఉన్న 48 రైస్ మిల్స్ గోదాంలు అనువుగా ఉంటే కలెక్టర్ పర్మిషన్తో వాటిని తీసుకుంటాం. మూడు నెలల పాటు వడ్లు నిలువ పెట్టే ప్లాన్‌తో వెళ్తున్నాం. ఇప్పటి వరకు 54,250 మంది రైతులకు రూ.1,084 కోట్ల పేమెంట్స్ చేశాం. రెండు రోజుల్లో మరో రూ.260 కోట్ల చెల్లించనున్నాం.- శ్రీకాంత్‌రెడ్డి, డీఎం, సివిల్ సప్లయ్