V6 News

సర్పంచులంతా BRS నుంచి బయటికి రండి:ఎంపీ అర్వింద్ 

సర్పంచులంతా BRS నుంచి బయటికి రండి:ఎంపీ అర్వింద్ 

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. అరిగోస పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని వీడాలని సర్పంచులకు సూచించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని.. సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ పర్సంటేజీలు అడగడంతో పరిశ్రమలు పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయనందున గత నాలుగేండ్లుగా వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నా బీమా ప్రయోజనం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. 

కామారెడ్డిలో రైతులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహిస్తే బయటకు రావొద్దని మంత్రి కేటీఆర్ కలెక్టర్ కు ఫోన్ చేయడాన్ని అర్వింద్ తప్పుబట్టారు. ఇదేనా రైతు రాజ్యం అని ప్రశ్నించారు. 112 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. బీజేపీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. రాష్ట్రంలో బీజేపి ప్రభుత్వం వస్తే డబల్ ఇంజన్ సర్కార్ తో రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రైతు రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.20,106 కోట్లు కేటాయిస్తే అందులో నుంచి కేవలం రూ.10,171 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అందులో కేవలం 6 శాతం మాత్రమే రైతులకు కేటాయించారని తెలిపారు. కేంద్రంలో రైతు రాజ్యం తీసుకొచ్చే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కేంద్రం కేటాయించిన నిధులను మాయం చేసిందని విమర్శించారు.