ఇద్ద‌రు సీఎంలు క‌లిసే ఈ దోపిడి చేస్తున్నారు

ఇద్ద‌రు సీఎంలు క‌లిసే ఈ దోపిడి చేస్తున్నారు

హైదరాబాద్: కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్ర‌దేశ్‌ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్. ఇరు రాష్ట్రాల సీఎంలు క‌లిసే ఈ దోపిడికి పాల్ప‌డుతున్నార‌న్నారు. గురువారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అల్మాస్ గూడ లోని నిరుపేద‌ల‌కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎంపీ. మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరామ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ మాధురి వీర కర్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జ‌‌రిగింది. ఈ సంద‌ర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్ర‌భుత్వం రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు తరలిస్తుంద‌ని అన్నారు. కేసీఆర్, జగన్ కలిసే ఈ దోపిడీ చేస్తున్నారని అన్నారు.

గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల సహకారంతోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఇప్పుడు వైయస్ జగన్ సొంత నిర్ణయంతో తెలంగాణ ప్రజలను దోపిడి చేస్తున్నారని అన్నారు. గతంలో ఎలాగైతే కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం నీళ్ల పంపకం జరిగిందో.. అదేవిధంగా ఇప్పుడు కూడా జరగాలని ఆయ‌న‌ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.