నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో బుధవారం పోలింగ్ ముగిసింది. 3,48,051 మంది ఓటర్లకుగాను 2,05,753 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ముగిసే సమయానికి 59.12 శాతం ఓటింగ్‌నమోదైంది. 1,67,461 మంది పురుషుల్లో 98,469 మంది ఓటు వేయగా, 1,80,546 మహిళలకుగాను 1,07,282 మంది ఓటు వేశారు. ఇతరులు 44 మందిలో ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 7 గంటలకు పోలింగ్ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 5 గంటల్లోపు పోలింగ్ సెంటర్లోకి వచ్చిన వారికి టోకన్లు ఇచ్చి ఓటు వేసేందుకు అనుమతించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య పోలింగ్ సెంటర్లు విజిట్ చేసి ఓటింగ్ జరుగుతున్న తీరు పరిశీలించారు. పోలింగ్ ముగిశాక 729 పోలింగ్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను పోలీస్ బందోబస్త్ మధ్య నగరంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు. రూమ్స్‌కు సీల్ వేసి సాయుధ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్స్ చుట్టూ భారీ వెలుతురు విరజిమ్మే లైట్లు ఏర్పాట్లు చేశారు.
19వ డివిజన్లో లాఠీ చార్జ్
పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 19 వ డివిజన్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్‌కు భిన్నంగా పోలింగ్ కేంద్రానికి దగ్గరలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులను పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. 28 డివిజన్ కోసం ఖిల్లా స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతుందని తెలిసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు అటు వెళ్లారు. హరిచరణ్మార్వడీ స్కూల్ల్లోని పోలింగ్ సెంటర్లో తమ ఓటును వేరే వారు వేశారని ఇద్దరు ముస్లిం మహిళలు వెనుదిరిగారు. బోగస్ ఓట్లు వేస్తున్నారని తెలిసి వచ్చిన ఎంపీ అర్వింద్ పోలీసులను తీవ్ర స్వరంతో దూషించగా ఆయనపై కేసు నమోదైంది.
పోలింగ్ స్టాఫ్ వాదన..
ఎలక్షన్ నిర్వహించిన తమకు భోజన సదుపాయాలు నాసిరకంగా చేశారని పోలింగ్ స్టాఫ్ ఆరోపించారు. పోలింగ్ తరువాత బ్యాలెట్ బాక్స్‌లు అప్పగించడానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు వచ్చాక రూ.800 చొప్పున పేమెంట్ చేయడాన్ని వ్యతిరేకించారు. ఇతర జిల్లాల్లో రూ.1,300 చెల్లిస్తుండగా తమకు తక్కువ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విషయాన్ని పరిష్కరిస్తామని నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్ వారికి నచ్చజెప్పారు.
