
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్ఎంసీ
- నోవాలో 50 సీట్లు, మహావీర్ కాలేజీలో 50 సీట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో వంద ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే కొడంగల్, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలకు సీట్ల పెంపుకు పర్మిషన్ ఇచ్చిన ఎన్ఎంసీ.. తాజాగా మరో రెండు ప్రైవేట్ కాలేజీల్లో కూడా సీట్ల పెంపునకు పచ్చజెండా ఊపింది. గత నెలలో కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. అలాగే, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో మరో 25 సీట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం నోవా మెడికల్ కాలేజీకి 50 సీట్లు, మహావీర్ మెడికల్ కాలేజీకి మరో 50 సీట్లు పెంచుకోవడానికి ఓకే చెప్పింది. దీంతో నోవా, మహావీర్ కాలేజీలలో ప్రస్తుతం ఉన్న 150 సీట్ల సంఖ్య 200కు చేరింది. మొత్తంగా ఈ ఏడాది రాష్ట్రంలో 175 కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. పెరిగిన సీట్లన్నీ ఈ అకడామిక్ నుంచే అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో 8,640కి చేరిన ఎంబీబీఎస్ సీట్లు
వంద సీట్లను పెంచుకోవడానికి ఎన్ఎంసీ అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలో మొత్తం మెడికల్ సీట్ల సంఖ్య 8,640కి చేరింది. ప్రస్తుతం 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,265 సీట్లు, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,200 సీట్లు ఉన్నాయి. కొత్తగా కొడంగల్ లో 50, ఈఎస్ఐసీలో 25, నోవాలో 50, మహావీర్ కాలేజీలో 50 సీట్లతో కలిపి మొత్తం సీట్ల సంఖ్య 8640కు పెరిగింది. అలాగే, మెడికల్ కాలేజీల సంఖ్య 65కి చేరింది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాబోయే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 5 వేల ఎంబీబీఎస్, 5 వేల పీజీ సీట్లను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో తెలంగాణలో మరిన్ని మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.