నాలుగు నెలల్లో మెడికల్ కాలేజీల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే : ఎన్ఎంసీ 

నాలుగు నెలల్లో మెడికల్ కాలేజీల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే : ఎన్ఎంసీ 
  • టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఎన్ఎంసీ ఆదేశాలు
  • విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌‌ షిప్‌‌ లూ క్లియర్ చేయాలి
  • ర్యాగింగ్‌‌ కు పాల్పడితే కేసు పెట్టాలి.. ప్రతి నెలా ఏటీఆర్ ఇవ్వాలి
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శకాలు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత కారణంగా విద్యార్థులపై పడుతున్న అకడమిక్ ఒత్తిడిని తగ్గించేందుకు.. ఖాళీగా ఉన్న అన్ని టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టులను రాబోయే నాలుగు నెలల్లోగా కచ్చితంగా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ తదితర వర్గాల బ్యాక్‌‌ లాగ్ పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే స్పెషల్ రిక్రూట్‌‌మెంట్ డ్రైవ్‌‌ లు చేపట్టాలని స్పష్టం చేసింది.

విద్యార్థులకు పెండింగ్‌‌లో ఉన్న స్కాలర్‌‌ షిప్‌‌లన్నింటినీ 4 నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. స్కాలర్‌‌ షిప్ రాలేదన్న సాకుతో విద్యార్థులను క్లాసులు, ఎగ్జామ్ ల నుంచి బహిష్కరించడం, హాస్టళ్ల నుంచి గెంటివేయడం, సర్టిఫికెట్లు ఆపడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్(ఎన్టీఎఫ్) సిఫార్సుల మేరకు ఎన్‌‌ఎంసీ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్​ నమోదు చేయాలి

క్యాంపస్‌‌ లో లేదా హాస్టళ్లలో విద్యార్థి ఆత్మహత్య లేదా అసహజ మరణం సంభవిస్తే యాజమాన్యాలు విషయాన్ని దాచకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయించాలని వెల్లడించింది. భౌతిక, సామాజిక, సైబర్, అకడమిక్ తదితర అన్ని రకాల ర్యాగింగ్‌‌ లపైనా జీరో టాలరెన్స్ పాటించాలని, ర్యాగింగ్‌‌ కు పాల్పడితే పోలీసు కేసు పెట్టాలని సూచించింది.

అలాగే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు శిక్షణ పొందిన ప్రొఫెషనల్ మెంటల్ హెల్త్ నిపుణులనే నియమించాలని, సాధారణ ఫ్యాకల్టీకి ఆ బాధ్యతలు అప్పగించొద్దని తేల్చిచెప్పింది. కాలేజీ కిలోమీటర్ పరిధిలో 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సదుపాయం ఉండాలని ఆదేశించింది. ఈ నిబంధనల అమలుపై ప్రతి నెలా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని కాలేజీలకు ఎన్ఎంసీ స్పష్టం చేసింది