- మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ ఆదేశం
- నీట్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు నిర్ణయం
- మే 3న దేశవ్యాప్తంగా నీట్-2026 ఎగ్జామ్
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా మే 3న జరగనున్న నీట్(యూజీ) ప్రవేశ పరీక్ష నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షా సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షకు ముందు రోజు అంటే మే 2న, పరీక్ష రోజు మే 3న మెడికల్ విద్యార్థులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని ఆదేశించింది.
సీనియర్లే సాల్వర్లుగా అనుమానం..!
గతంలో జరిగిన నీట్ పరీక్షల్లో కొన్నిచోట్ల మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు సాల్వర్ గ్యాంగ్స్ తో చేతులు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బుల కోసం వేరే వాళ్లకు బదులుగా పరీక్ష రాయడం వంటి అక్రమాలకు కొందరు విద్యార్థులు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.
కాలేజీలు అప్రమత్తంగా ఉండాలి..
పరీక్ష సక్రమంగా నిర్వహించేలా మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లు బాధ్యత తీసుకోవాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ ఆదేశించారు. విద్యార్థులు ఇలాంటి చట్టవిరుద్ధ పనుల్లోకి వెళ్లకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి రాసిన లేఖను ఉటంకిస్తూ ఎన్‌ఎంసీ ఈ నోటీసు జారీ చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని, విద్యార్థులైతే వారి మెడికల్ సీటు రద్దు కావడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది.

