
ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలిచి, మోదీనే మళ్లీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. " దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదు. చాలా అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నేను ఈ మాట చెబుతున్నాను. అందులో దేశ ప్రయోజనాలను ఎవరు పరిరక్షిస్తారు? దేశం ఎవరి చేతుల్లో సురక్షితంగా, పటిష్టంగా ఉంటుంది? అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఎవరు పెంచుతారు వంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి " అని పవార్ వివరించారు. ఎన్నికల ముందు చేసే అంచనాల ఆధారంగా ఎలక్షన్ రిజల్ట్ ఉండదని చెప్పారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు.