
- ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే
- తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం
- ట్రయిల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్
- వాదనలకు టైమ్ ఇవ్వలేదన్న అధికారులు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు గురువారమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని పిటిషన్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దూదేజాతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకించేందుకు ట్రయల్ కోర్టు తమకు అవకాశం ఇవ్వలేదని ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు హైకోర్టు బెంచ్‌కు వివరించారు.
బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ.. అప్పీల్ కోసం 48 గంటల సమయం ఇవ్వాలని కోరినా ట్రయల్ కోర్టు తిరస్కరించిందని అన్నారు. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, విక్రమ్ చౌదరి హైకోర్టు బెంచ్‌కు వాదనలు వినిపించారు. ఈడీ తరఫు న్యాయవాది చేస్తున్న వాదనల్లో నిజం లేదని, న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. కాగా, అర్వింద్ కేజ్రీవాల్‌పై ఈడీ అధికారులు నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యాలు అందజేయడంలో విఫలం కావడంతోనే బెయిల్ మంజూరు చేసినట్టు జడ్జి నియామ్ బిందు చెప్పారు.
కేజ్రీవాల్‌ను టెర్రరిస్ట్‌లా చూస్తున్నరు: సునీత కేజ్రీవాల్
దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని, అర్వింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు టెర్రరిస్టుల చూస్తున్నారని సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆప్ నేతలు శుక్రవారం చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. లిక్కర్ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థను ప్రధాని మోదీ అపహాస్యం చేస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు.