ఏరియా హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లలో  బెడ్లు సాల్తలేవ్​!

ఏరియా హాస్పిటల్స్, హెల్త్ సెంటర్లలో  బెడ్లు సాల్తలేవ్​!
  • ఔట్ పేషెంట్లకు తప్పని ఇబ్బందులు
  • గోల్కొండ, మలక్ పేట్, నాంపల్లి ఆస్పత్రుల్లో 43 ఏళ్లుగా వంద పడకలే
  • వనస్థలిపురం, కొండాపూర్ జిల్లా హాస్పిటల్స్ లోనూ ఇదే పరిస్థితి
  • వాటిలో పెంచితే టీచింగ్ ఆస్పత్రులపై తగ్గనున్న పేషెంట్ల రద్దీ
  •  పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు 

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ( టీవీవీపీ ) పరిధిలోని ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బెడ్స్​ సాల్తలేవు. పేషెంట్లు ఇబ్బందులు పడుతూనే ట్రీట్​మెంట్​ చేయించుకుంటున్నారు. గ్రేటర్​లో 5 ఏరియా ఆస్పత్రులు, 7  కమ్యూనిటీ హెల్త్​సెంటర్లు ఉన్నాయి. ఇందులో గోల్కొండ , నాంపల్లి, మలక్ పేట్ ఏరియా హాస్పిటల్స్​ని 43 ఏళ్ల కిందట 100 పడకలతో నిర్మించారు. 20 ఏళ్ల కిందట వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 100, కొండాపూర్​జిల్లా హాస్పిటల్​లో 200 పడకలతో ఏర్పాటు చేశారు.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా ఆస్పత్రుల్లో బెడ్స్​పెంచలేదు. వీటితో పాటు పానీపురా, శ్రీరామ్​నగర్, జంగంమ్మెట్, అంబర్​పేట్, డబీర్​పురా, లాలాపేట్​ అర్బన్​కమ్యూనిటీ హెల్త్​సెంటర్లది ఇదే పరిస్థితి. ఒక్కో సెంటర్​లో ప్రారంభ సమయంలో10 బెడ్స్ ను ఏర్పాటు చేశారు.  బార్కాస్ కమ్యూనిటీ హెల్త్​సెంటర్​లో 50 బెడ్స్​ఉండగా అక్కడ కూడా అదనంగా బెడ్స్​ లేవు. ఆయా హాస్పిటల్స్ లో బెడ్స్​ని పెంచకపోవడంతో టీచింగ్​ఆస్పత్రులకు పేషెంట్ల రద్దీ పెరుగుతుంది. చిన్న జబ్బులకు ట్రీట్​మెంట్​కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ లో అందితే పెద్దాసుపత్రుల దాకా వచ్చే పరిస్థితి ఉండదు. సర్కార్​సిటీ నలువైపులా సూపర్​స్పెషాలిటీ హాస్పిటల్స్​కట్టుడేమో కానీ ఉన్నవాటిని మాత్రం పట్టించుకోవడంలేదు. 
కరోనా సమయంలోను పట్టించుకోలె 
కరోనా మొదలైనప్పటి నుంచి ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో బెడ్స్​ని పెంచడంపై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టలేదు. బెడ్స్​అదనంగా పెంచి స్టాఫ్ ని కూడా రిక్రూట్​చేసుంటే వేలాది మంది కరోనా పేషెంట్లకు మెరుగైన ట్రీట్ మెంట్​అందేది. కరోనా తీవ్రత ఉన్నప్పుడు వీటిలో  కొన్ని బెడ్స్​ని  పేషెంట్లకు కేటాయించారు.  ఏరియా హాస్పిటల్స్​ కి వచ్చే కేసుల్లో ఎక్కువగా గర్భిణులు ఉంటున్నారు. ఐదు ఏరియా ఆస్పత్రుల్లో నెలకు 1,100 డెలివరీలు అవుతుంటాయి. వాటిలో ఉన్న బెడ్లలో సగం వరకు బాలింతలకు కేటాయి స్తారు. ఎప్పుడు డెలివరీ కేసులు వస్తాయో తెలియక మరో 10 బెడ్స్​రెడీగా ఉంటాయి. మిగిలిన బెడ్స్​మాత్రమే ఇతర పేషెంట్లకు కేటాయిస్తుంటారు. 
ఖాళీ లేవంటూ వేరే ఆస్పత్రులకు రెఫర్ 
ప్రతి ఏరియా ఆస్పత్రికి డైలీ500 లకు పైగా పేషెంట్లు వెళ్తుంటారు. అడ్మిట్​అవసరమైన వారిని బెడ్స్​ లేక చేర్చుకోకుండానే వేరే ఆస్పత్రులకు డాక్టర్లు రెఫర్​చేస్తున్నారు. సీజనల్ కేసులు కొద్దిగా పెరిగాయంటే బెడ్స్​దొరకడం కష్టంగా ఉంటుంది. దీంతో టీచింగ్​ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అర్బన్​కమ్యూనిటీ హెల్త్​సెంటర్లలోనై తే ఓపీ సేవలే ఉన్నాయి. ప్రతి సెంటర్​లో 10 బెడ్స్​ఉన్నా ఇన్​ పేషెంట్​గా అడ్మిట్​అయ్యేది చాలా తక్కువ. ఎమర్జెన్సీ డెలివరీ కేసులు వస్తే వేరే ఆస్పత్రికే  రెఫర్​చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 
కొత్తగా ఏర్పాటు చేయట్లే ..
ఖైరతాబాద్, అమీర్ పేట్ లో   కొత్తగా కమ్యూనిటీ హెల్త్​సెంటర్ల ఏర్పాటు ఏండ్లుగా సాగుతోంది. ఖైరతాబాద్ లో 100 పడకల హాస్పిటల్​ను ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్మించినా నేటికి ప్రారంభించలేదు.  అమీర్​పేట్​లోను ఏర్పాటు కోసం కొంతమంది స్టాఫ్ రిక్రూట్​మెంట్​ కూడా పూర్తయింది. మరికొన్నాళ్ల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 
త్వరలో బెడ్స్​ పెంచుతాం
గోల్కొండ, మలక్ పేట్​ఏరియా ఆస్పత్రుల్లో త్వరలో బెడ్లు పెంచుతాం. కరోనా థర్డ్​వేవ్​ని దృష్టిలో పెట్టుకొని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా మెరుగైన ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. ఖైరతాబాద్​, అమీర్​ పేట్ ఆస్పత్రులను ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో ఓపెన్​చేస్తాం.             - డాక్టర్​సునీత, డీసీహెచ్ఎస్,  హైదరాబాద్ జిల్లా