న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ.. బయో బబుల్‌ను ఏర్పాటు చేయడం లేదు. క్రికెటర్ల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బబుల్‌ను తొలగించనుందని సమాచారం. ‘అన్ని అనుకున్నట్లుగా జరిగి, ఇప్పుడున్నట్లుగానే పరిస్థితులన్నీ కంట్రోల్లో ఉంటే బబుల్‌ను, హార్డ్ క్వారంటైన్‌ను తీసేస్తాం. సౌతాఫ్రికాతో హోమ్ సిరీస్ నుంచే దీనిని అమలు చేయాలని భావిస్తున్నాం. ఇంగ్లండ్, ఐర్లాండ్ వెళ్లినా బబుల్‌లో ఉండబోం. బబుల్‌లో ఎక్కువ కాలం ఉండటం అంత మంచిది కాదని తెలుస్తున్నది. అది ప్లేయర్స్ మెంటల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొంత మంది మధ్యలో బ్రేక్ తీసుకుంటున్నారు. కానీ అందరి శ్రేయస్సు దృష్ట్యా బబుల్‌ను పూర్తిగా తీసేయాలని అనుకుంటున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు. అయితే ప్లేయర్లకు క్రమం తప్పకుండా టెస్ట్‌లు నిర్వహిస్తామన్నాడు. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఇంగ్లండ్ టూర్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రా, షమీ, జడేజాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
