బస్సుల కోసం  మండుటెండలో.. ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు

బస్సుల కోసం  మండుటెండలో.. ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు
  • షెల్టర్లు లేక ఎండలకు ఇబ్బందిపడుతున్న ప్యాసింజర్లు
  • 411 బస్సు షెల్టర్స్ కావాలని జీహెచ్ఎంసీకి ప్రపోజల్ పెట్టిన ఆర్టీసీ
  • 78 చోట్ల పనులు ప్రారంభించామని తెలిపిన బల్దియా అధికారులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​లో ఎండలు దంచికొడుతుంటంతో బస్సు జర్నీ అంటేనే సిటీ జనం బేజారవుతున్నారు. చాలాచోట్ల బస్ షెల్టర్లు లేకపోవడంతో ఎండలకు అల్లాడుతున్నారు. మండుటెండలో నిలబడి బస్సుల కోసం ఎదురుచూడలేక మెట్రో, ప్రైవేటు ట్రాన్స్​పోర్టు​లో వెళ్తున్నారు. గ్రేటర్ సిటీలో బస్టాప్ ఉన్నప్పటికీ షెల్టర్లు లేని ప్రాంతాలను ఇటీవల ఆర్టీసీ అధికారులు గుర్తించారు. 411 ప్రాంతాల్లో షెల్టర్లు నిర్మించాలని బల్దియాకు 2 నెలల కిందట ప్రపోజల్ పెట్టారు. కానీ 78 షెల్టర్ల నిర్మాణ పనులను మాత్రమే ప్రారంభించినట్లు ఇటీవల బల్దియా.. ఆర్టీసీ అధికారులకు తెలిపింది. కనీసం ఆ షెల్టర్లు కూడా పూర్తికాకపోవడంతో ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. 

70 శాతం మంది పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్​లోనే..

గ్రేటర్ సిటీలో దాదాపు 30 శాతం మంది ఓన్ వెహికల్స్​లో జర్నీ చేస్తుండగా.. 70 శాతం మంది పబ్లిక్ ట్రాన్స్​పోర్ట్, ప్రైవేటు వెహికల్స్​ను ఆశ్రయిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో బస్సు షెల్టర్లను నిర్మించే బాధ్యతను ఆర్టీసీ 2008లో జీహెచ్ఎంసీకి అప్పగించింది. ఎక్కడెక్కడ బస్సు షెల్టర్లు అవసరమో ఆర్టీసీ అధికారులు గుర్తించి ఆ ప్రపోజల్స్​ను బల్దియాకు పంపుతారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ షెల్టర్ల నిర్మాణ బాధ్యతలను యాడ్ ఏజెన్సీలకు అప్పగిస్తుంది. కానీ, ఆర్టీసీ, బల్దియా మధ్య కో ఆర్డినేషన్ లోపం కనిపిస్తోంది. అందుకే ఆర్టీసీ  రిక్వెస్టులను జీహెచ్ఎంసీ సీరియస్​గా తీసుకోవట్లేదు. దీంతో చాలా బస్టాప్​ల వద్ద షెల్టర్లు ఉండటం లేదు. దీనివల్ల ప్యాసింజర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఉన్న కొన్ని బస్ షెల్టర్లలో పై కప్పు లేకపోవడంతో ఎండలకు మరింత ఇబ్బందిపడుతున్నారు. మరికొన్ని బస్ షెల్టర్లలో కుర్చీలు ఉండటం లేదని ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిటీలో ఏసీ బస్ షెల్టర్లు ఉన్నప్పటికీ చాలా చోట్ల ఏసీలు పనిచేయడం లేదు. ఇంతగా ఎండలు కొడుతున్నా.. ఒక్క ఏసీ బస్సు కూడా తిరగడం లేదని ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు.

అన్ని ఏర్పాట్లు చేస్తున్నం

గ్రేటర్​లో బస్ షెల్టర్ల కోసం జీహెచ్ఎంసీకి ప్రపోజల్స్ పంపించాం. అవసరం అనుకున్న చోట తాత్కాలిక బస్‌‌షెల్టర్స్ నిర్మించాం. 78 చోట్ల పనులు జరుగుతున్నాయి. ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా చూస్తం. సిటీలో ఆర్డినరీ, మెట్రో కలిపి మొత్తం 2,800 బస్సులు తిరుగుతున్నాయి. జూన్ చివరినాటికి కంటోన్మెంట్ డిపోకి 28 ఎలక్ట్రిక్ బస్సులు, సెప్టెంబర్ నాటికి మియాపూర్ డిపోకి 32 ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వస్తాయి.
–శ్రీనివాసరావు, డిప్యూటీ రీజినల్ మేనేజర్,గ్రేటర్ హైదరాబాద్

ఎండకు నిలబడుతున్నం

బస్ షెల్టర్లు లేక ఎండకు నిలబడాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో మరింత ఇబ్బంది పడుతున్నాం. బస్ షెల్టర్లు నిర్మించి ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆ టైమ్​లో బస్సుల సంఖ్య పెంచాలి. 
–మురళి, ఎల్ బీనగర్