భూభారతి చట్టంలో మార్పులు అక్కర్లే.. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మార్పులు అవసరం: టీజేఎస్ చీఫ్ కోదండరాం

భూభారతి చట్టంలో మార్పులు అక్కర్లే.. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మార్పులు అవసరం: టీజేఎస్ చీఫ్ కోదండరాం
  •   గతంలో మాదిరి బ్యాక్‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేంజెస్‌‌‌‌‌‌‌‌కు వీలుండొద్దు 
  •   రాష్ట్రంలో సమగ్ర భూసర్వే జరగాల్సిన అవసరం ఉందని వెల్లడి 

పంజాగుట్ట, వెలుగు: భూభారతి చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, అయితే సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం మార్పులు చేయాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘‘భూభారతి చట్టంలో తక్షణమే మార్పులు చేయాల్సిన అవసరం లేదు. గ్రామీణ, మండల స్థాయిలో చర్చలు జరిగాకే చట్టం వచ్చింది. కానీ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. 

మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ‘ధరణి సమస్యలను భూభారతి పరిష్కరించిందా?’ అనే అంశంపై రౌండ్​టేబుల్​సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ‘‘భూభారతి చట్టం రాగానే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ వచ్చాయి. 

ఇందులో ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. రికార్డులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఎక్కించడమే సమస్య. ఇప్పటి వరకు ధరణిలో ఎక్కించిన రికార్డులు ఉన్నాయి. అందులో తప్పులు జరగడంతో కొత్తగా తీసుకువచ్చిన భూభారతిలో మనం చేయాలనుకుంటున్న మార్పులు ఏమిటో స్పష్టత కావాలి. భూభారతిలో టెక్నాలజీకి సంబంధించిన మార్పులు జరగాలి. 

గతంలో మాదిరి బ్యాక్‌‌‌‌‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మార్పులు చేయడానికి వీలుండకుండా చేయాలి. గ్రామ స్థాయిలో సదస్సులు ఏర్పాటు చేసి అక్కడికక్కడే భూసమస్యలు పరిష్కరించాలి. అలాగే రాష్ట్రంలో సమగ్ర భూసర్వే జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. దీని కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకురావాలి” అని కోరారు. అలాగే  రైట్ టు సర్వీసెస్ యాక్ట్ ప్రకారం.. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందనే చట్టం ఉంటుందని, మన దగ్గర కూడా దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ.. భూసమస్యలు శాంతి భద్రతల సమస్యలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలు తమ కష్టార్జితంతో కొన్న భూములు.. ఏండ్ల తరబడి వాళ్ల అధీనంలోకి రావడం లేదన్నారు. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ జర్నలిస్టు యూనియన్​అధ్యక్షుడు కప్పరి హరిప్రసాద్, బింగి లింగస్వామి, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్​దేశాయ్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.