సిబిల్ స్కోర్​పై నో క్లారిటీ ...రాజీవ్​ యువ వికాసానికి తప్పనిసరా? కాదా?

సిబిల్ స్కోర్​పై నో క్లారిటీ ...రాజీవ్​ యువ వికాసానికి తప్పనిసరా? కాదా?
  • గైడ్​లైన్స్​లో కంపల్సరీ అని పేర్కొన్న రాష్ట్ర సర్కారు
  • అవసరం లేదన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు 
  • సిబిల్​పరిశీలనకు బ్యాంకర్లకు రేపటికే తుది గడువు
  • అయోమయంలో యువ వికాసం దరఖాస్తుదారులు 

మంచిర్యాల, వెలుగు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం అమలు చేసే రాజీవ్​యువ వికాసం స్కీమ్ లో సిబిల్​స్కోర్​పై అయోమయం నెలకొంది. స్కీమ్ గైడ్​లైన్స్​లో లబ్ధిదారులకు సిబిల్ స్కోర్​ కంపల్సరీ అని పేర్కొనడంపై విమర్శలు రావడంతో మూడురోజుల కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.  

సిబిల్​స్కోర్​చూడాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. కానీ ఆఫీసర్లు మాత్రం సిబిల్​ స్కోర్ మినహాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొంటున్నారు. మరోవైపు ఈనెల 17లోగా దరఖాస్తుదారుల సిబిల్​స్కోర్​పరిశీలించి బ్యాంక్​కన్సెంట్​అందజేయాలని ఆదేశాలున్నట్టు బ్యాంకర్లు చెప్తున్నారు. రెండు రోజుల గడువు మాత్రమే ఉండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. 

5 లక్షల యూనిట్లు.. 16 లక్షలకు పైగా అప్లికేషన్లు

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం రాష్ర్ట ప్రభుత్వం రాజీవ్​ యువ వికాసం స్కీమ్ ను తీసుకొచ్చింది. వివిధ రంగాల్లో స్కిల్​డెవలప్​మెంట్​ట్రైనింగ్  ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్​మెంట్ యూనిట్లు పెట్టుకునేలా ఎంకరేజ్​చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్​రెడ్డి గత మార్చి 15న స్కీమ్​ను లాంఛనంగా ప్రారంభించారు. రూ.6వేల కోట్లతో 5 లక్షల మందికి యూనిట్లు సాంక్షన్​చేస్తామని ప్రకటించారు. దీంతో ఆన్‌లైన్‌లో భారీగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ర్టవ్యాప్తంగా 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 

బ్యాంక్​ కాన్సెంట్​ ఇస్తేనే.. 

స్కీమ్ కింద యూనిట్​కాస్ట్​ను బట్టి 100 నుంచి 70 పర్సెంట్​వరకు రాష్ట్ర సర్కారు సబ్సిడీ ఇస్తోంది. మిగతా మొత్తానికి బ్యాంక్​లోన్​సాంక్షన్​ చేస్తుండగా.. ఇక్కడే సమస్య తలెత్తింది. దరఖాస్తుదారుల సిబిల్​స్కోర్​ ఆధారంగానే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. రాజీవ్​యువ వికాసం గైడ్​లైన్స్​లో కూడా అలానే పేర్కొనడంతో ఇబ్బందులు వచ్చిపడ్డాయి. నిరుద్యోగ యువతకు లోన్లు మంజూరు చేసేముందు బ్యాంకింగ్ వారి రికార్డులు, అప్పు చెల్లింపు సామర్థ్యం, గత రుణ చరిత్రలపై పరిశీలన చేస్తాయి.  

మెరుగైన సిబిల్​స్కోర్ ఉన్న అభ్యర్థులకే బ్యాంకర్లు లోన్​ కాన్సెంట్​ఇచ్చే చాన్సుంది. ఈ స్కీమ్ కింద రూ.50వేల యూనిట్​కు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ అందిస్తుండగా. రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంక్​లోన్​, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 పర్సెంట్​సబ్సిడీ, 20 శాతం లోన్​, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇస్తుండగా, బ్యాంకులు 30 శాతం ​లోన్​ ఇవ్వాల్సి ఉంటుంది.