గంధమల్ల కాల్వల నిర్వాసితులకు అందని పరిహారం

గంధమల్ల కాల్వల నిర్వాసితులకు అందని పరిహారం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యంతో పరిహారం అందకపోగా, ఆఫీసర్ల అలసత్వం కారణంగా రైతుబంధు రాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పనుల్లో భాగంగా 15వ ప్యాకేజీ కింద యాదాద్రి జిల్లా తుర్కపల్లిలోని గంధమల్ల చెరువును 8 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత 4.28 టీఎంసీలకు తగ్గించారు. ఇప్పుడు 1.5 టీఎంలకే పరిమితం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం 2,618 ఎకరాలు, కాల్వల కోసం 3,841 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు.  రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం వల్ల సిద్దిపేట జిల్లా జగదేవ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో 334, యాదాద్రి జిల్లా తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, జనగామ జిల్లా బచ్చన్నపేట కలుపుకొని మొత్తం 63,300 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని అంచనా వేశారు.

ఇంకా అందని పరిహారం

గంధమల్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నుంచి రాజాపేట మండలం వరకు నిర్మించే కాల్వల కోసం మొత్తం 3,841 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందులో తుర్కపల్లి, రాజాపేట మండలంలోని బేగంపేట, నర్సాపురం, కొండ్రెడ్డి చెరువు, పుట్ట గూడెం, పల్లగూడెం, సింగారం, పాంకుంట, బేగంపేటతో పాటు పలు గ్రామాల్లో ఇప్పటివరకు 1,088 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో 530 ఎకరాలకు అప్పటి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ వాల్యూ ప్రకారం రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు పరిహారం చెల్లించారు. అయితే ఈ మండలాల్లో మార్కెట్‌‌‌‌‌‌‌‌ రేటు ఎకరానికి రూ. 30 లక్షల నుంచి రూ. కోటి వరకు ఉండగా ప్రభుత్వం తక్కువ రేటు చెల్లిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిహారం డబ్బులు కూడా ఇంకా అందరికీ అందలేదు. 

ఆగిన రైతుబంధు

గంధమల్ల రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు భూములు ఇచ్చిన రైతుల్లో 530 మందికే పరిహారం ఇచ్చిన ఆఫీసర్లు మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదు. అయితే కాల్వల కోసం భూములు తీసుకున్నట్లు రికార్డులో నమోదు చేయడంతో ఆయా రైతులకు రైతు బంధు కూడా ఆగిపోయింది. ప్రభుత్వం సేకరించిన భూములనే బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెట్టాల్సిన ఆఫీసర్లు ఇదేమీ పట్టించుకోకుండా మొత్తం సర్వే నంబర్లను బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో ఆయా సర్వే నంబర్లలో భూములు ఉన్న రైతులకు గత మూడేళ్లుగా రైతుబంధు అందడం లేదు. ఈ విషయంలో ఆఫీసర్లను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుబంధు రావట్లే... 

బేగంపేటలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో రెండున్నర ఎకరాలు గంధమల్ల కాల్వ కింద పోతోంది. ప్రభుత్వం భూ సేకరణ చేసి నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికీ పరిహారం రాలేదు. రైతుబంధు కూడా అందడం లేదు. బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో రూ. 70 లక్షలు పలుకుతున్న భూమికి ప్రభుత్వం రూ. 7.60 లక్షలు నిర్ణయించింది. పరిహారం ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేయొద్దు. 
– నీల ఉప్పలయ్య, రైతు, బేగంపేట