డ్రిప్​ సాంక్షన్​ చేస్తలేరు వేలల్లో అప్లికేషన్లు.. వందల్లో మంజూరు

డ్రిప్​ సాంక్షన్​ చేస్తలేరు  వేలల్లో అప్లికేషన్లు.. వందల్లో మంజూరు

మహబూబ్​నగర్​, వెలుగు : వరికి బదులు  ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటున్న  ప్రభుత్వం రైతులకు ఏం సాగు చేసుకోవాలో అవగాహన కల్పించడం లేదు. ఇప్పటికే హర్టికల్చర్​వైపు మొగ్గుచూపిన రైతులకు రాయితీలు కూడా ఇవ్వడం లేదు. రైతుబంధు ఇస్తున్నామనే పేర  సబ్సిడీ డ్రిప్​ స్కీమ్ మంజూరు చేయడంలేదు.  కంపెనీలు డ్రిప్ పరికరాల రేట్లు పెంచాయని, ఆ భారాన్ని  రైతులే  మోయాలని సర్కారు చెప్తోంది. ఏటా డ్రిప్​ఇరిగేషన్​యూనిట్లు మంజూరు చేస్తున్నట్టు లెక్కల్లో చూపిస్తున్నా, దరఖాస్తు చేసుకున్న వారిలో కొద్దిమందికే యూనిట్లు అందుతున్నాయి.  

ఆరు కంపెనీలే మిగిలాయి

2020‌‌‌‌‌‌‌‌– -21లో డ్రిప్​, స్ర్పింక్లర్లు సరఫరా చేసేందుకు 28 కంపెనీలు  తెలంగాణ సర్కారుతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ కంపెనీలే రైతులకు సబ్సిడీపై డ్రిప్​, స్పింక్లర్లు సప్లై చేశాయి. కొవిడ్​టైం​లో ప్లాస్టిక్​ రేట్లు పెరగడంతో  23 కంపెనీలు డ్రిప్​పరికరాల రేట్లను  పెంచాయి. కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య రేట్లపై చర్చలు జరిగాయి. రేట్లు పెంచాల్సిందేనని కంపెనీలు.. పాత రేట్లకే సప్లై చేయాలని ప్రభుత్వం పట్టుపట్టాయి. దీంతో  23 కంపెనీలు ప్రభుత్వంతో తమ అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నాయి.  దీంతో ప్రస్తుతం జైన్,  ఫినోలెక్స్, సిగ్నెట్, ఏబీటీ, గ్లోబల్​కంపెనీలు మాత్రమే డ్రిప్​, స్పింక్లర్లు సప్లై చేస్తున్నాయి. కొత్తగా శేఖర్​ఇరిగేషన్ సిస్టమ్స్​కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.  గతంలో ప్రభుత్వం సబ్సిడీపై అందించిన డ్రిప్​పైపులు బాగా ఉండేవని, ఇప్పుడు అసలు నాణ్యమైన పైపులు సప్లై చేయడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తక్కువ గేజ్​ ఉన్న పైపులు ఇయ్యడంవల్ల తోటల్లో ట్రాక్టర్లు తిరిగితే పగిలిపోతున్నాయని, డ్రిప్​ మంజూరైనా ఫాయిదా ఉండటం లేదంటున్నారు. తామే స్వయంగా హైదరాబాద్​నుంచి ప్రైవేట్​గా పైపులు తెచ్చుకుంటున్నామన్నారు. అదనంగా అయిన ఖర్చును తాము సొంతంగా భరించుకోవాల్సివసోందని అంటున్నారు.  డ్రిప్ ఇరిగేషన్​కు ఎకరానికి రూ.  లక్ష ఖర్చవుతుందని,  ప్రభుత్వం సర్టిఫైడ్​ కంపెనీలతో అగ్రిమెంట్​ చేసుకుంటే నాణ్యమైన పైపులు సరఫరా జరిగేవని, తమపై అదనపు భారం పడేది కాదని అంటున్నారు. 

పాలమూరులో ఇదీ పరిస్థితి

మహబూబ్​నగర్​ జిల్లాలో రైతులు వివిధ పండ్ల తోటలు వేసుకున్నారు.2,371 మంది రైతులు 9,329 ఎకరాల్లో మామిడి తోటలను, 60 మంది రైతులు 375 ఎకరాల్లో దానిమ్మ, 212 మంది రైతులు 499 ఎకరాల్లో జామ, 46 మంది రైతులు 105 ఎకరాల్లో నిమ్మ,  274 మంది రైతులు 780 ఎకరాల్లో నారింజ తోటలను సాగు చేస్తున్నారు. వీరిలో కొందరికి ఆరేడేండ్ల కిందట సబ్సిడీపై డ్రిప్​మంజూరు చేశారు. అప్పటి నుంచి వారు ఆ పైపులనే వాడుతున్నారు. ప్రస్తుతం వాటి కాలపరిమితి తీరిపోయింది. దీంతో వారు మళ్లీ కొత్తగా డ్రిప్​కోసం అప్లై చేసుకున్నా..  మంజూరు చేయడం లేదు.  2021-–22 లో  2,741 రైతులు 3413.08 హెక్టార్లలో డ్రిప్​ఇరిగేషన్​కోసం రిజిస్ట్రేషన్​ చేయించుకోగా.. 244 మంది రైతులకు 332.4 హెక్టార్లలో డ్రిప్​ ఇరిగేషన్​  మంజూరు అయినట్టు హార్టికల్చర్​డిపార్ట్​మెంట్​లెక్కలు చెప్తున్నాయి. 

సొంతంగా డ్రిప్​ ఏర్పాటు చేసుకున్న

నాకున్న రెండు ఎకరాల్లో మామిడి తోట పెట్టుకున్న. డ్రిప్​ కోసం అప్లై చేసుకుందామనుకున్న. కానీ,రెండేళ్ల నుంచి గవర్నమెంట్​ సబ్సిడీ కింద డ్రిప్​ ఇవ్వడం లేదు. అందుకే అప్లై చేయకుండా వదిలేసిన. రూ. 80 వేలతో సొంతంగా డ్రిప్​ఏర్పాటు చేసుకున్న.
- వెంకట్​రెడ్డి, రైతు, మిడ్జిల్

రేట్లు ఎక్కువని వదిలేసిన..

నాకున్న ఒక ఎకరం పొలంలో టమాట, మిరప తోట పెట్టుకున్న. డ్రిప్​ కోసం అప్లై చేసుకున్నా. కానీ, రేట్లు విపరీతంగా ఉన్నాయి. సబ్సిడీ ఇస్తామంటున్న, ఎకరానికి రూ.60 వేలు కట్టాలనడంతో అప్లికేషన్​ను వాపస్​ తీసుకున్న. 
- గండిటి మల్కయ్య, రైతు, గాదిర్యాల్ గ్రామం