ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ శుక్రవారం (నవంబర్ 21) నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగుతుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. హోమ్ గ్రౌండ్ కావడంతో ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా జట్టు గురువారం (నవంబర్ 20) తమ ప్లేయింగ్ 11 ప్రకటించింది.
ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజాతో పాటు జేక్ వెదరాల్డ్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడు. వెదరాల్డ్ కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. మార్నస్ లాబుస్చాగ్నే తనకు కలిసొచ్చిన మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగనున్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. కమ్మిన్స్ లేకపోవడంతో తొలి టెస్టుకు స్మిత్ ఆసీస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ట్రావిస్ హెడ్, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ వరుసగా 5,6,7 స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఏకైక స్పిన్నర్ గా నాథన్ లియాన్ ఆడతాడు. మిచెల్ స్టార్క్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్ లు ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు.
ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ కు తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో చోటు కల్పించలేదు. కమ్మిన్స్, హేజల్ వుడ్ గాయపడడంతో తొలి టెస్టులో బ్రెండన్ డాగెట్ కు ప్లేయింగ్ 11లో అవకాశం వచ్చింది. ఈ ఫాస్ట్ బౌలర్ కు ఇదే డెబ్యూ టెస్ట్. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు దూరం కావడంతో ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో విజయం సవాలుగా మారింది. డిసెంబర్‌లో బ్రిస్బేన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు కమ్మిన్స్, హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది.
ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసింది.
HERE WE GO 🤩
— cricket.com.au (@cricketcomau) November 20, 2025
The Australian XI for the first Ashes Test in Perth 👇 pic.twitter.com/6lXwDZ7hBe
