లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ : 14 నెలల తర్వాత దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ : 14 నెలల తర్వాత దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్

భారతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి ఇవాళ. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు ఎన్విడియా ఆర్థిక ఫలితాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచాయి. విదేశీ నిధుల ప్రవాహం కూడా మార్కెట్ ఉత్సాహానికి తోడుగా నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సూచీ 503.13 పాయింట్లుపెరిగి 85,689.60 వద్దకు చేరింది. ఇదే సమయంలో నిఫ్టీ 150.45 పాయింట్లు పెరిగి 26,203.10 వద్ద ఉంది. 14 నెలల తర్వాత నిఫ్టీ మళ్లీ 26200 స్థాయికి ఎగువకు చేరుకుంది. 

నిఫ్టీ50లో ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు 3 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు మాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్, హెచ్‌డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ దాదాపు 1 శాతం వరకు నష్టపోయాయి.

మార్కెట్‌ ర్యాలీకి వెనుక కీలక కారణాలు..

1. విదేశీ పెట్టుబడులు : బుధవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) రూ. 1,580.72 కోట్లు విలువైన షేర్లు కొనుగోలు చేశారు. ఇది మార్కెట్లలో సానుకూల ట్రేడింగ్ సెంటిమెంట్ ప్రేరేపించింది.

2. అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. దక్షిణ కొరియా కోస్పీ, జపాన్ నిక్కీ 225 సూచి 3 శాతం పైగా పెరిగాయి. షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు కూడా లాభాల్లో ఉండగా.. అమెరికా మార్కెట్లు టెక్నాలజీ షేర్ల వలన బలంగా ట్రేడింగ్ ముగించటం బలమైన నమ్మకాన్ని ఇన్వెస్టర్లలో నింపింది. 

►ALSO READ | ఇకపై ఆధార్ కార్డుపై ఫోటో, QR కోడ్‌ మాత్రమే.. UIDAI కొత్త సేఫ్టీ చర్యలు..

3. రిలయన్స్ స్టాక్: మార్కెట్ బరువైన కంపెనీల్లో ముందంజలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1.5 శాతం పెరిగి ఒక్కో షేరు ధర రూ.1,540.90కి చేరింది. యూబీఎస్ సంస్థ కంపెనీపై “బై” రేటింగ్‌ను కొనసాగిస్తూ.. ఆయిల్ -టూ -కెమికల్స్ వ్యాపార అభివృద్ధి, నూతన ఇంధన రంగం పురోగతిపై ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక టెక్నికల్స్ విషయానికి వస్తే.. మార్కెట్ రికవరీ ఆసరా లభించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. నిఫ్టీ 26,130 నుండి 26,550 వరకు పెరగొచ్చన్నారు. అయితే వేగవంతమైన పెరుగుదలకు అవకాశాలు తక్కువగా ఉండొచ్చని చెప్పారు.