ఓయూలోకి బయటి వ్యక్తులకు నో ఎంట్రీ

ఓయూలోకి బయటి వ్యక్తులకు నో ఎంట్రీ
  • బయటి వ్యక్తుల  ప్రవేశానికి బ్రేక్?
  • వాకింగ్, ఆడుకునేందుకు వచ్చే వారికి యూజర్​ చార్జీలు
  • డిసెంబర్​ 1 నుంచి అమలు

ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలోకి  బయటి వ్యక్తుల ప్రవేశానికి బ్రేక్​ పడనుంది. ఎప్పుడంటే అప్పుడు ఓయూ గేటు దాటేందుకు అవకాశం లేదు. డిసెంబర్​ 1 నుంచి కేవలం అనుమతి ఉన్నవాళ్లనే లోపలికి రానిస్తారు.  స్టూడెంట్స్, స్టాఫ్ మాత్రమే ఐడీ కార్డు చూపించి ఉచితంగా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వాకర్స్, ఆడుకునేందుకు వచ్చే వాళ్ల నుంచి యూజర్​ చార్జీలు వసూలు చేయనున్నారు. వాకర్స్​ నుంచి నెలకు రూ.200, గ్రౌండ్​ వాడుకునే వాళ్లు రూ.500 చెల్లించాలని ఓయూ అధికారులు శనివారం సర్క్యులర్​ రిలీజ్​ చేశారు. జిమ్​కు వెళ్లాలంటే  వెయ్యి చెల్లించి పాస్​ తీసుకోవాలి. రోజూ గంటన్నర మాత్రమే  యూజ్ ​చేసుకోవాలి. వాకర్స్, ఆటలు ఆడుకునే వాళ్ల కోసం గ్రౌండ్​ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలే ఓపెన్​ ఉంటుంది. గ్రౌండ్ మెంబర్​షిప్​ తీసుకున్న వారు బాస్కెట్​బాల్​ కోర్టు, ఫుడ్​బాల్ ​గ్రౌండ్, అథ్లెటిక్స్​ గ్రౌండ్ వాడుకోవచ్చు. 

ఓయూలో నివాసం ఉంటున్నోళ్ల సంగతి?
ఓయూలోని పలు ప్రాంతాల్లో ఏడు క్యాంపులున్నాయి. బస్తీల మాదిరి ఏర్పడి వీటిల్లో సుమారు 10  వేల వరకు జనాభా నివాసం ఉంటోంది. గతంలో వీళ్లను ఖాళీ చేసే ప్రయత్నాలు జరిగినా వీలు కాలేదు. వీరంతా యూనివర్సిటీ  రెండు గేట్ల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీళ్లందరికీ పాస్​లు లేదా  ఐడీలు ఇస్తారా? అన్న దానిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీళ్లు రాకపోకలకు ఎలా అనుమతి పొందాలన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.  ఉచిత పాస్​లు ఇస్తే ఓయూకు ఆనుకుని ఉన్న పలు బస్తీల జనం కూడా ఉచిత పాస్​లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. వీళ్లు కూడా ఓయూ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.   

గాలి కోసం వస్తం.. డబ్బులు వసూలు చేస్తరా?: రిటైర్డ్​ ప్రొఫెసర్లు
ఓయూతో తమకు ఏండ్ల నుంచి అనుబంధం ఉందని, ఎంతో కాలం క్యాంపస్​కు సేవలందించామని, స్వచ్ఛమైన గాలి కోసం వస్తున్న తమ నుంచి చార్జీలు వసూలు చేయడం ఏంటని రిటైర్డ్​ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. వాకర్స్​నుంచి యూజర్ ​చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదంటున్నారు.