టీబీ వ్యాక్సిన్ తో క‌రోనా కంట్రోల్ అవుతుందా?: WHO ప్ర‌క‌ట‌న‌

టీబీ వ్యాక్సిన్ తో క‌రోనా కంట్రోల్ అవుతుందా?: WHO ప్ర‌క‌ట‌న‌

టీబీకి ఇచ్చే బీసీజీ వ్యాక్సినేష‌న్ వ‌ల్ల క‌రోనా కంట్రోల్ అవుతుంద‌ని ఇటీవ‌ల మూడు ప్ర‌ముఖ రీసెర్చ్ సంస్థ‌లు త‌మ అధ్య‌య‌నాల‌ను ప్ర‌చురించాయి. క్ష‌య ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న‌ దేశాల్లో ఈ వ్యాక్సిన్ చిన్న‌ప్పుడే పిల్ల‌ల‌కు ఇస్తున్నందు వ‌ల్లే ఆ కంట్రీస్ లో క‌రోనా కేసులు తక్కువ‌గా ఉన్నాయ‌ని అంచ‌నా వేశాయి. ఈ అధ్య‌య‌నాల‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. టీబీ వ్యాక్సిన్ తో క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని చెప్పే శాస్త్రీయ ఆధారాలేవీ లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ స్ట‌డీలు ఆ దేశాల్లో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య ఆధారంగా అంచ‌నాకు వ‌చ్చాయ‌ని, ప్ర‌యోగాత్మ‌కంగా క‌రోనాతో లింక్ చేయ‌లేద‌ని తెలిపింది.

క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయ్

టీబీ వ్యాక్సిన్ ను జంతువులు, మ‌నుషులపై ప్ర‌యోగించి ఫ‌లితాల‌ను చెక్ చేస్తున్న‌ట్లు తెలిపింది WHO. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాక్సిన్ ద్వారా ప్ర‌త్యేకించి ఇమ్యూనిటీ సిస్ట‌మ్ పై ఎటువంటి ప్ర‌భావం క‌నిపించ‌లేద‌ని, క‌రోనాను నియంత్రించే శ‌క్తి మ‌నిషికి వ‌చ్చిన‌ట్లుగా స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేవ‌ని చెప్పింది. స‌ర్వేలు చేసిన సంస్థ‌లు టీబీ వ్యాక్సినేష‌న్ చేస్తున్న దేశాల్లోని క‌రోనా కేసులను వ్యాక్సిన్ ఇవ్వ‌ని దేశాల‌తో పోల్చి చూసి అధ్య‌య‌నాన్ని ప్ర‌చురించిన‌ట్లు పేర్కొంది WHO. అమెరికాలోని న్యూయార్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, టెక్సాస్ లోని ఆండ‌ర్స‌న్ కేన్స‌ర్ సెంట‌ర్, భార‌త్ లోని చండీగ‌ఢ్ లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్ సంస్థ‌లు ఈ త‌ర‌హా స్ట‌డీస్ ప్ర‌చురించిన‌ట్లు తెలిపింది. అయితే ఇంకా రెండు ర‌కాల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయ‌ని, వాటి ఫ‌లితాలు రావాల్సి ఉంద‌ని WHO స్ప‌ష్టం చేసింది. క్లియ‌ర్ గా అధారాలు లేకుండా బీసీజీ వ్యాక్సినేష‌న్ వ‌ల్ల క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని చెప్ప‌లేమ‌ని తెలిపింది. అయితే టీబీ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న దేశాల్లో బిడ్డ పుట్టిన కొద్ది రోజుల‌కు ఈ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌ని సూచించింది.