ఆహారం ఉన్నా వడ్డించే వారు లేరు.. క్యూలైన్లలో శ్రీవారి భక్తుల అవస్థలు

ఆహారం ఉన్నా వడ్డించే వారు లేరు.. క్యూలైన్లలో శ్రీవారి భక్తుల అవస్థలు

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలు అందించేవారు కరవయ్యారు. వారాంతం కావడంతో శనివారం నుంచి కొండపైకి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సాధారణ దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. తమకు సరైన సదుపాయాలు కల్పించడంలో టీటీడీ సిబ్బంది అలక్ష్యం వహిస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

పాత్రల్లో ఆహారం ఉన్నా వడ్డించే వారు లేక పిల్లలు, వృద్దులు ఆకలితో అలమటించారు. గంగాళాలతో ఆహార పదార్థాలను తీసుకువచ్చిన టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు వాటిని అక్కడే వదిలి వెళ్లిపోయారని వాపోయారు. ఈ అవస్థలు చూడలేక కొందరు క్యూలైన్లలో నుంచి బయటకు వచ్చి తోటి భక్తులకు ఆహారాన్ని అందించారు. సామాన్య భక్తులకు నిత్యం 15 గంటల దర్శనం కల్పించడంతో పాటు వసతి సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని టీటీడి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.