బ్యాంకు అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదని జరిమానాలు విధించే రోజులకు త్వరలోనే చెక్ పడనుంది. సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ నిర్వహించలేకపోయినందుకు బ్యాంకులు విధిస్తున్న జరిమానాలను నిలిపివేయాలని పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సు చేసింది. ఈ జరిమానాలు సామాన్యులపై ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై అనవసరమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సేవల విభాగాన్ని కోరింది.
బీజేపీ ఎంపీ చంద్ర ప్రకాష్ జోషి నేతృత్వంలోని 15 మంది సభ్యుల లోక్‌సభ పిటిషన్ల కమిటీ ఈ అంశంపై లోతుగా చర్చించింది. ఖాతాదారులు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచలేనప్పుడు వారిపై జరిమానాలు వేయడం అనేది చాలా కఠినమైన చర్య అని కమిటీ పేర్కొంది. జరిమానాలు విధించి భయపెట్టడం కంటే, కనీస నిల్వ కంటే ఎక్కువ నగదును మెయింటెయిన్ చేసే కస్టమర్లకు రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు లేదా మెరుగైన వడ్డీ రేట్లు ఇచ్చి ప్రోత్సహించడం మంచిదని సూచించింది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 మార్చి నుంచే అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను రద్దు చేసింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి మెజారిటీ ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈ దారిలోనే నడుస్తున్నాయి. అయితే కొన్ని దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులు, ఇతర బ్యాంకులు ఇంకా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నాయని కమిటీ గుర్తించింది. దీనివల్ల సామాన్య ఖాతాదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో ప్రైవేట్, ప్రభుత్వ, కోఆపరేటివ్, గ్రామీణ బ్యాంకులన్నింటికీ వర్తించేలా ఒకే రకమైన విధానాన్ని రూపొందించాలని కమిటీ ప్రతిపాదించింది. బ్యాంకులన్నీ యూనిఫామ్ పాలసీని అనుసరించేలా ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ ఈ సిఫార్సు అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా కోట్లాది మంది చిన్న కస్టమర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నాయన్న ఆందోళన లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందే అవకాశం కలుగుతుంది.
