ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డులకే సర్కారు మొగ్గు

 ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డులకే సర్కారు మొగ్గు
  • మునుగోడు బైపోల్ ముందు హామీ ఇవ్వలేదన్న చైర్మన్ 

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తుంటే వారికి ఆర్టీసీ మేనేజ్‌మెంట్ షాక్ ఇచ్చింది. ఇటీవలే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. యూనియన్లను మళ్లీ ప్రారంభిస్తామని మునుగోడు బైపోల్​కు ముందు తాము హామీ ఇవ్వలేదని బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్  ప్రకటించారు. యూనియన్లను రద్దు చేసి వాటి స్థానంలో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డు స్టేట్ లెవల్ మీటింగ్ ఈ నెల 4న హైదరాబాద్​లో నిర్వహిస్తామని ఎండీ సజ్జనార్  ఇటీవల ప్రకటించారు. 

మూడేండ్లుగా పత్తాలేని వెల్ఫేర్ కమిటీలు మళ్లీ చర్చలోకి వచ్చాయి. ప్రతి రీజియన్ పరిధిలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఇద్దరు వెల్ఫేర్ ప్రతినిధుల పేర్లు పంపాలని ఆర్ఎంలను ఎండీ ఆదేశించారు. బోర్డు సభ్యులు సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. మూడు నెలలకోసారి డిపోల్లో వెల్ఫేర్ బోర్డుల మీటింగ్​లు జరుగుతున్నాయని, వారు మేనేజ్​మెంట్​తో సమావేశమవుతూ కార్మికుల సమస్యలు తీరుస్తున్నారని ఎండీ తెలిపారు. 

దీనిపై యూనియన్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆర్టీసీలో 2019లో సమ్మె ముగిసిన తర్వాత యూనియన్ల ప్లేస్ లో ప్రతి డిపోలో ఇద్దరు కార్మికులతో వెల్ఫేర్ బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యూనియన్ల వల్ల ఆర్టీసీ రెవెన్యూకు గండి పడుతుందని, అందుకే బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

ప్రభుత్వ ఆదేశాల మేరకే మీటింగ్ 

ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నెల 4న ఆర్టీసీ మేనేజ్ మెంట్ మీటింగ్  నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీలో చర్చ జరుగుతోంది. మూడేండ్లుగా స్టేట్ లెవల్ మీటింగ్ నిర్వహించకుండా ఇప్పుడు సడన్ గా సమావేశం నిర్వహించడంపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి నుంచే వెల్ఫేర్ కమిటీలను కీలకం చేసే దిశగా మేనేజ్​మెంట్ ఉందని సమాచారం. ఇదే జరిగితే ఉద్యోగులపై వేధింపులు, పనిభారం పెరిగే చాన్స్ ఉందని నేతలు అంటున్నారు.

మళ్లీ యూనియన్లను అనుమతించాలి.. 

మునుగోడు బైపోల్​కు ముందు ఆర్టీసీ సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీశ్, చైర్మన్ బాజిరెడ్డి చర్చలు జరిపారని టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏఆర్​ రెడ్డి, థామస్​రెడ్డి అన్నారు. యూనియన్లను మళ్లీ ఓపెన్  చేస్తామని హామీ ఇచ్చారని, కానీ, ఇప్పుడు అలాంటి హామీ తాము ఇవ్వలేదని అంటున్నారన్నారు. వెల్ఫేర్ బోర్డులను రద్దుచేసి యూనియన్లను మళ్లీ అనుమతించాలని డిమాండ్‌ చేశారు.