నకిలీ విత్తనాలు అమ్మేటోళ్లపై పీడీ యాక్టు పెడ్తలే

నకిలీ విత్తనాలు అమ్మేటోళ్లపై పీడీ యాక్టు పెడ్తలే

420 కేసులతోనే సరిపెడుతున్న సర్కార్ 
 ఐదేండ్లలో నలుగురిపైనే పీడీ యాక్టు 
 డీలర్ల లైసెన్సులు కూడా రద్దు చేస్తలే 
ఈ ఏడాది ఇప్పటికే రూ.72 కోట్ల నకిలీ సీడ్స్ దొరికినయ్
 
హైదరాబాద్, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్ముతూ దొరుకుతున్న నిందితులపై సర్కార్ కఠిన చర్యలు తీసుకోవడం లేదు. పీడీ యాక్టు కేసులు పెడ్తామని చెప్పిన రాష్ట్ర సర్కార్.. నిందితులపై ఆ కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. ఐదేండ్లలో కేవలం నాలుగే కేసులు పెట్టింది. మిగతావన్నీ 420 కేసులు పెట్టి చేతులు దులుపుకొంది. దీంతో నకిలీ విత్తన ముఠాలు రెచ్చిపోతున్నాయి. దొడ్డిదారిన కల్తీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నాయి. ఐదేండ్ల నుంచి పోలీస్ టాస్క్ ఫోర్స్, వ్యవసాయాధికారుల బృందాలు అక్కడక్కడ తనిఖీలు నిర్వహించగా.. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు, అనుమతి లేని సీడ్స్ దొరికాయి. అయితే నిందితుల్లో కేవలం నలుగురిపైనే పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు. 2017లో ఇద్దరిపై, 2018లో మరో ఇద్దరిపై ఈ కేసులు పెట్టారు. మిగతా వారందరిపై 420, 6ఏ సెక్షన్ల మీదనే కేసులు పెట్టి సరిపెట్టారు. పోయినేడాది 18 మందిపై 6ఏ కేసులు, 237 మందిపై క్రిమినల్​ కేసులు నమోదు చేశారు. దీంతో అక్రమార్కులు ఈజీగా బయటకు వచ్చేసి, మళ్లీ నకిలీ విత్తన దందా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు పత్తి, మిర్చికే పరిమితమైన నకిలీ విత్తనాల దందా.. ఇప్పుడు వరి, కందులు, సోయాబీన్​ల దాకా చేరింది. ఈ ఏడాది ఇప్పటికే 18 వేల క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.72 కోట్లు ఉంటుందన్నారు. ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.  
అధికారుల అండదండలతోనే...  
నకిలీ విత్తనాలు అమ్మేటోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన వ్యవసాయ అధికారులే.. వారితో కలిసి ఈ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా అధికారుల ఇండ్లలోనే నకిలీ సీడ్స్ ఉంచి, అమ్మకాలు చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి నిరంజన్​రెడ్డికి పోలీసులు ఈ విషయాన్ని చెప్పినట్లు తెలిసింది. ఈ దందాలో అధికారుల పాత్ర ఉంటే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించినట్లు సమాచారం. కాగా, నకిలీ విత్తనాలు అమ్ముతూ దొర్కుతున్న డీలర్ల లైసెన్సులనూ ప్రభుత్వం రద్దు చేయడం లేదు. ఈ విషయంలో కొందరు ఉన్నతాధికారులు డీలర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా డీలర్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే.. వారిలో 70 మంది లైసెన్సులను మాత్రమే సస్పెండ్​ చేశారు. వీరిలో కొందరి లైసెన్సులను తొలుత పూర్తిగా రద్దు చేసినప్పటికీ, ఆ తర్వాత సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.