అంబేద్కర్ మహాసభ మే 8కి వాయిదా

అంబేద్కర్ మహాసభ మే 8కి వాయిదా

ఇందిరాపార్క్ ఏరియాలో MRPS అంబేద్కర్ వాదుల మహా సభకు హైకోర్టు అనుమతివ్వలేదు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం… విగ్రహ ధ్వంసానికి నిరసనగా… ఏప్రిల్ 27న అంబేద్కర్ మహావాదుల సభ నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు అనుమతివ్వాలని పలుమార్లు పోలీస్ శాఖను కోరింది. హైకోర్టులోనూ పిటిషన్ వేసింది. కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి.

సరూర్ నగర్ స్టేడియంలో సభ పెట్టుకోవచ్చని.. ఇందిరాపార్క్ దగ్గర వద్దని ప్రభుత్వం తరుపు అడ్వకేట్ కోర్టుకు చెప్పారు. ఐతే… ఇందిరా పార్కు దగ్గరే సభ నిర్వహించుకుంటాం అని కోర్ట్ కు తెలిపారు ఎమ్మార్పీఎస్ తరుపు న్యాయవాది. మరోరోజు సభ పెట్టుకోవాలని కోర్టు పిటిషనర్లకు సూచించింది. కోర్టు సూచనకు అంగీకరించిన మందకృష్ణ తరఫు న్యాయవాది మే 8న సభ పెట్టుకుంటాం అని కోర్టుకు తెలిపారు. సభ ఎక్కడ నిర్వహిస్తాం  అనేది సోమవారం చెబుతాం అని అన్నారు. దీంతో.. తర్వాత విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

మే 8న అంబేద్కర్ మహా సభ : మందకృష్ణ

“హైకోర్టు సూచన పాటిస్తాం. న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా గౌరవిస్తున్నాం. మే 8న అంబేద్కర్ మహావాదుల సభ నిర్వహించాలని నిర్ణయించాం. అంబేద్కర్ గౌరవాన్ని ఎవరు దెబ్బతీసినా మేం నిరసన తెలుపుతాం. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతను గౌరవించినట్టుగా కనిపించడం లేదు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను ఆయన పాటించడంలేదు. రేపటి సభను వాయిదా వేస్తున్నాం. అంబేద్కర్ వాదులు గమనించగలరు” అన్నారు మందకృష్ణ మాదిగ.

మరోవైపు…  హైదరాబాద్ లో అంబేద్కర్ మహావాదుల సభకు జిల్లాలనుంచి బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని తిప్పిపంపించేశారు.