హైదరాబాద్ లో ఉదయం, సాయంత్రం హెవీ వెహికల్స్​కు నో పర్మిషన్

హైదరాబాద్ లో ఉదయం, సాయంత్రం హెవీ వెహికల్స్​కు నో పర్మిషన్
  •     ఆటో, క్యాబ్ డ్రైవర్లు యూనిఫామ్ ధరించాల్సిందే
  •     రూల్స్ బ్రేక్ చేస్తే కేసులు నమోదు 
  •     సైబరాబాద్​ లిమిట్స్​లో కొత్త ట్రాఫిక్ రూల్స్

గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో  ఉదయం, సాయంత్రం వేళల్లో  హెవీ వెహికల్స్ తిరిగేందుకు పర్మిషన్ లేదని మాదాపూర్ జోన్​ ఇన్​చార్జి ​ట్రాఫిక్​డీసీపీ శ్రీనివాస్​రావు వెల్లడించారు. రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్​ను కంట్రోల్ చేసేందుకే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గురువారం ఆయన గచ్చిబౌలిలోని మాదాపూర్ ​జోన్ ​ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ​లిమిట్స్​లో అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ వివరాలను వెల్లడించారు.

సైబరాబాద్​ రోడ్లపై హెవీ వెహికల్స్( డీసీఎం, వాటర్​ ట్యాంకర్లు, ఆర్ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్లు)కు ప్రతిరోజు ఉదయం  7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి10.30 గంటల వరకు అనుమతి లేదని డీసీపీ శ్రీనివాస్​రావు చెప్పారు. కన్​స్ట్రక్షన్ ​అండ్ ​డిమాలేషన్ వెహికల్స్​ఉదయం 6  గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు రోడ్లపై పర్మిషన్ లేదన్నారు. నిషేధిత వేళల్లో రోడ్లపై తిరిగే వాహనాలకు మొదటి సారి ఫైన్ వేస్తామని, రెండోసారి రూల్స్ బ్రేక్ చేస్తే వాహనాన్ని సీజ్ చేసి ఆర్టీఏకి అప్పగిస్తామని డీసీపీ తేల్చి చెప్పారు. 

ఫ్లై ఓవర్లపై స్లో వెహికల్స్ ను అనుమతించం 

భారీ వాహనాలు, నెమ్మదిగా వెళ్లే వాహనాలు సైబరాబాద్​ లిమిట్స్​లోని ఫ్లై ఓవర్లపై వెళ్లేందుకు అనుమతించడం లేదని డీసీపీ శ్రీనివాస్​రావు తెలిపారు. ఆటో, క్యాబ్​డ్రైవర్లు విధుల్లో యూనిఫామ్ కచ్చితంగా  ధరించాలని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీ, ఆర్టీసీ బస్సులు, ట్రాన్స్​పోర్ట్ వాహనాల​డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్​రూల్స్ పాటించాలన్నారు. మల్టీప్లెక్స్ థియేటర్, హాస్పిటల్స్, ఇతర వ్యాపార భవనాల వద్ద రోడ్డుపై వెహికల్ పార్క్ చేస్తే నోటీసులు ఇస్తామని, స్పందించకపోతే 15 రోజుల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.  

ఫుట్​పాత్​లను ఆక్రమించి వ్యాపారం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇందుకోసం స్పెషల్​డ్రైవ్​చేపడతామన్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కేసులు బుక్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు నో ఎంట్రీ టైమ్ లో రోడ్డుపైకి వచ్చిన భారీ వెహికల్స్ పై 11 వేల 7 కేసులు నమోదు చేశామన్నారు.

కమిషనరేట్ పరిధిలో 55 పెలికాన్​ సిగ్నల్స్​ ఏర్పాటు చేశామని, పాదచారులు వాటిని వినియోగించుకోవాలని డీసీపీ సూచించారు. సమావేశంలో మేడ్చల్​జోన్ ట్రాఫిక్​ఏడీసీపీ వేణుగోపాల్​రెడ్డి, మాదాపూర్​జోన్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు.