భారత్, రష్యా సంబంధాలపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేయవ్

భారత్, రష్యా సంబంధాలపై ఎలాంటి ఒత్తిళ్లు పనిచేయవ్

న్యూఢిల్లీ: భారత్ ఏం కోరినా ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లారోవ్ అన్నారు. ఈ విషయంలో ఇండియాతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్న లారోవ్..  పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ తో పలు దశాబ్దాలుగా రష్యాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినవి. భారత విదేశాంగ విధానం అనేది వారి జాతీయ ఆసక్తులకు మీద ఆధారపడింది. రష్యన్ ఫెడరేషన్లో కూడా ఇదే పాలసీ అమల్లో ఉంది. ఈ విధానమే భారత్, రష్యాలను పెద్ద దేశాలుగా, మంచి మిత్రులుగా, నమ్మకమైన భాగస్వాములుగా మార్చింది’ అని లారోవ్ పేర్కొన్నారు. 

భారత్, రష్యా సంబంధాలపై ఎలాంటి ఒత్తిళ్లు ప్రభావం చూపబోవని లారోవ్ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. ఉక్రెయిన్తో ఉద్రిక్తతల గురించి ఆయన స్పందిస్తూ.. ‘మీరు దాన్ని యుద్ధం అంటున్నారు. కానీ అది నిజం కాదు. అదో స్పెషల్ ఆపరేషన్. కేవలం మిలటరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాం. రష్యాకు ముప్పు కలిగించే చర్యలు పెరగకుండా.. కీవ్ పాలకుల ప్రయత్నాలకు చెక్ పెట్టడమే మా లక్ష్యం’ అని స్పష్టం చేశారు. కాగా, ఇండియాకు చౌక ధరకే చమురును అమ్ముతామని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది కనీసం 15 మిలియన్ల బ్యారెళ్లను భారత్కు విక్రయించాలని రష్యా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రూబెల్స్లోనే చెల్లింపులు జరపాలని భారత్ను రష్యా కోరిందని వార్తలు వస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.