మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ప్రపోజల్స్ రాలే

మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ప్రపోజల్స్ రాలే
  • మెడికల్ కాలేజీల కోసం రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ రాలే
  • పార్లమెంట్‌‌లో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: మెడికల్‌‌ కాలేజీల ఏర్పాటు కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌‌లో వెల్లడించింది. జిల్లా హాస్పిటళ్లను మెడికల్‌‌ కాలేజీలుగా మార్చడానికి 2017లో కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 మెడికల్‌‌ కాలేజీల ఏర్పాటుకు నిధులు ఇచ్చింది. ఇందులో తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించకపోవడంపై కేంద్రాన్ని ఎంపీ ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఒక్క ప్రపోజల్‌‌ కూడా రాలేదని, ప్రపోజల్స్‌‌ పంపిన అన్ని రాష్ట్రాలకూ కాలేజీలు మంజూరు చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌‌ పవార్‌‌‌‌ సమాధానమిచ్చారు. బీబీనగర్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్‌‌ మెడికల్‌‌ కాలేజీ, హాస్పిటల్‌‌ కోసం రూ.1,024 కోట్లు కేటాయించామని.. 2024 నాటికి ఆ పనులు పూర్తవుతాయని ఆమె తెలిపారు. ఎయిమ్స్‌‌లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 62 నుంచి 100కు పెంచామన్నారు. రాష్ట్రంలోని 12 ప్రభుత్వ, 23 ప్రైవేట్‌‌ మెడికల్‌‌ కాలేజీల్లో కలిపి 5,240 ఎంబీబీఎస్‌‌ సీట్లు, 2,237 పీజీ సీట్లు ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రంలో 175 పీఎంబీజేకేలు
తెలంగాణలో 157 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు ఉన్నాయని కేంద్రం చెప్పింది. దేశంలో  8,533 ఉన్నాయని, 2025 నాటికి 10,500కు పెంచుతామని ఎంపీ అర్వింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. దేశంలో డిఫెన్స్‌‌ ఇండస్ట్రియల్‌‌ కారిడార్ల ఏర్పాటుకు తెలంగాణ సహా 8 రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ అందాయని కేంద్రం చెప్పింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డీఐసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎంపీ కొత్త ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది.