1600 ఎకరాల భూముల రికార్డులు మాయం

1600 ఎకరాల భూముల రికార్డులు మాయం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/చిట్యాల, వెలుగు: తాత ముత్తాతల కాలం నుంచి రైతులు సాగు చేసుకుంటున్న 1600 ఎకరాల భూముల రికార్డులు మాయం అయ్యాయి. తెలంగాణ పాసు బుక్కులు ఉన్నా  ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో రైతుల పేర్లు కనిపించడం లేదు. 1బీ, పహణీలు రాకుండా చేసి కర్షకులను కష్టాల పాలు చేస్తున్నారు. వందలాది మంది రైతన్నలు సమస్యను పరిష్కరించాలని రెండు నెలలుగా పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం పచ్చని అడవులు.. సారవంతమైన భూములకు నెలవు. ఈ మండలంలోని నైన్‌‌‌‌పాక రెవెన్యూ విలేజ్​లో నైన్‌‌‌‌పాక, కుమ్మరపల్లె, వరికోల్‌‌‌‌పల్లి గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో 5,500 ఎకరాల భూమి ఉంది. గుడ్డెలుగుల బోడు ప్రాంతంలో సర్వే నెంబర్440లో 330.02, 441లో 440.09, 442లో 467, 443లో 337 ఎకరాలు మొత్తం కలిపి 1,614.11 ఎకరాల భూమి అప్పటి నిజాం పాలనలో తాలిబ్అలీ అనే దొర పేరుపై ఉండేది. 40, 50 ఏళ్ల క్రితమే అప్పటి రైతులు ఎకరానికి రూ.50 నుంచి రూ.100 వరకు తాలిబ్అలీకి చెల్లించి భూములు కొనుక్కున్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. దీంతో ఈ రైతులకు కాంగ్రెస్‌‌‌‌ గవర్నమెంట్​లో తెల్ల పాస్‌‌‌‌ బుక్కులు, తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా ఆకుపచ్చని రంగులో ముద్రించిన పాస్‌‌‌‌ బుక్కులు కూడా వచ్చాయి. 
ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో వివరాలు క్లోజ్‌‌‌‌ 
నైన్‌‌‌‌పాక రెవెన్యూ విలేజీ పరిధిలో తాలిబ్​అలీకి చెందిన 1,614 ఎకరాల భూములు గల 4 సర్వే నంబర్లను ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ఆఫీసర్లు బ్లాక్‌‌‌‌ చేశారు. రైతుల దగ్గర కొనుగోలు పత్రాలు, రిజిస్ట్రేషన్‌‌‌‌ డాక్యుమెంట్లు, పాత పాస్‌‌‌‌ బుక్కులు, తెలంగాణ పాస్‌‌‌‌ బుక్కులు ఉన్నా కూడా 1బీ, పహణీలు రాకుండా అడ్డుకట్ట వేశారు. రైతులు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా సమస్యను పరిష్కరించకుండా జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ ఆఫీసర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రైతులు రిలే నిరాహార దీక్షలు చేసినా పట్టించుకున్న వాళ్లు లేరు. రెవెన్యూ ఆఫీసర్లే కావాలని రికార్డులను మాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో బ్యాంకులో లోన్లు తీసుకోవడం, రెన్యువల్‌‌‌‌ చేసుకోవడం ఇబ్బందిగా మారిందని, రైతుబంధు డబ్బులు రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
పట్టించుకోని ఆఫీసర్లు
నైన్‌‌పాక రెవెన్యూ విలేజీ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు. ధరణి వెబ్‌‌‌‌సైట్​లో తెలంగాణ పాస్‌‌‌‌ బుక్కులు ఉన్న రైతులకు డిజిటల్‌‌‌‌ సైన్‌‌‌‌ చేయాల్సిన తహసీల్దార్ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. రైతులు ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా, సమస్యను పరిష్కరించాలని  జిల్లా కలెక్టరేట్‌‌‌‌ ఆఫీసు ముందు పెట్రోల్‌‌‌‌ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసినా రెవెన్యూ ఆఫీసర్లలో చలనం లేదు. తమ భూములను ఆక్రమించుకోవడానికి పంటను ధ్వంసం చేస్తున్నారని, పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ కు పోతే తమపైనే కేసులు పెడతామంటూ కొందరు పోలీసులు బెదిరిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. 
టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల కన్ను
నైన్‌‌‌‌పాక విలేజీలో ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ నుంచి రైతుల భూముల వివరాలు మాయం అవడం వెనుక కొందరు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల పాత్ర ఉన్నట్లుగా రైతులు చెబుతున్నారు. గణపురం మండలం మోరంచపల్లె, దుబ్బపల్లికి చెందిన టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ లీడర్లు రైతులను భయపెట్టి భూములను తక్కువ ధరకు కొనడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో రైతుల పేర్లు లేకుండా క్లోజ్‌‌‌‌ చేశారని వివరిస్తున్నారు. రైతులను భయపెట్టి భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, బహిరంగ మార్కెట్​లో ఎకరానికి రూ.15 లక్షలకు మించి రేటు ఉంటే కేవలం రూ. లక్ష చేతిలో పెట్టి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని అంటున్నారు. భూమి ఇవ్వని రైతుల పంటలను ధ్వంసం చేసి భయపెడుతున్నారని,  ‘నీ చుట్టూ ఉన్నవాళ్లు మాకు భూమి ఇచ్చారు.. నువ్వేం చేస్తావ్.. ఇచ్చింది తీసుకొని పక్కకు పో.. లేకపోతే ఈ డబ్బులు కూడా ఇవ్వం’ అని అంటున్నారని రైతులు వాపోతున్నారు. 

పొలిటికల్ ప్రెజర్ ఉంది
నైన్ పాక రెవెన్యూ విలేజ్​లో చాలామంది రైతులకు తెలంగాణ పాసుబుక్కులు ఇచ్చారు. భూములు సాగులో కూడా ఉన్నాయి. కానీ నాకంటే ముందు పని చేసిన ఆఫీసర్లు 440, 441, 442, 443 సర్వే నంబర్లను గుట్టలు గల భూమిగా చూపిస్తూ మొత్తం భూమిని ఫ్రీజింగ్​లో పెట్టారు. 1బి, పహణీల కోసం చాలామంది రైతులు దరఖాస్తులు ఇస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప నేనేం చేయలేను. పొలిటికల్ ప్రెజర్ ఉంది.
                                                                                                                                                                    - రామారావు, చిట్యాల తహసీల్దార్

నా పంటను ధ్వంసం చేసిన్రు
గుడ్డెలుగుల బోడు సమీ పంలో నాకు 2 ఎకరా లు, మా తమ్ముడికి 2 ఎకరాలు, మా బావ సిరికొండ సమ్మయ్యకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 25 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నం. భూమిని తమకు అమ్మాలని కొందరు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు వచ్చారు. నేను భూమిని అమ్మను అంటే జేసీబీతో 6 ఎకరాలలో వేసిన పత్తి పంటను ధ్వంసం చేశారు.  మాకు గవర్నమెంట్‌‌‌‌ అందించిన పాస్‌‌‌‌ బుక్కులున్నా న్యాయం చేసేటోళ్లు లేరు.
                                                                                                                                         ‒ వల్లంపట్ల రవి, వరికోల్‌‌‌‌ పల్లి రైతు, చిట్యాల మండలం
ఎకరానికి రూ.1.15 లక్షలు ఇచ్చారు
గుడ్డెలుగుల బోడు ప్రాంతంలో నేను ఎకరంన్నర భూమిని 10 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ లీడర్‌‌‌‌ వచ్చి ఎకరానికి రూ.1.15 లక్షల చొప్పున నగదు చేతిలో పెట్టి తెల్ల కాగితంపై సంతకం తీసుకున్నడు. నేను డబ్బులు తీసుకోను అంటే నీ చుట్టూ ఉన్న రైతులు భూమి అమ్మిండ్లు, నువ్వు తేడా చేస్తే ఈ డబ్బులు కూడా చేతికి రావు అని బెదిరించిండు.                                   ‒ పాకాల చిన్న రవి, వరికోల్‌‌‌‌ పల్లి రైతు, చిట్యాల మండలం