షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

కరోనా దెబ్బకు పార్లమెంట్​లో మారిన సీన్
చేతులు జోడించి పలుకరించుకుంటున్న ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా వైరస్ దెబ్బతో ఎంపీలు ఒకరికొకరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం మానేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీలు.. ‘‘షేక్ హ్యాండ్ వద్దు.. నమస్తే ముద్దు” అంటూ రెండు చేతులు జోడించి పలుకరించు కోవడం కనిపించింది. తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు లాబీల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇతర ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుందామని సూచించారు. కరోనా వైరస్ కారణంగా షేక్ హ్యాండ్స్‌ను కొంత కాలం మానేయడమే మంచిదని అన్నారు. చైనాలో కాళ్లతో పలకరించుకునే పరిస్థితి వచ్చిందని, మనకు అలాంటి పనిలేదని తెలిపారు. సంప్రదాయం ప్రకారం నమస్కారం (చేతులు జోడించి ) చెప్పుకుంటే సరిపోతుందని, అదే ఆరోగ్యానికి గొప్ప కానుకని సూచించారు. మాస్క్ ధరించి వచ్చిన ఎంపీ నవనీత్ టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ముఖానికి మాస్క్ ధరంచి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. కరోనాపై అవగాహన కల్పించేందుకే తాను ఇలా వచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా వైరస్ విజృంభించే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు ప్రజలు నివారణ చర్యలు పాటించాలని
సూచించారు. పార్లమెంట్ సభ్యులందరికీ స్క్రీనింగ్ చేయాలని, ప్రజలకు సబ్సిడీపై మాస్కులు అందజేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

రూ.2 మాస్క్.. రూ.20కి సేల్

మెడికల్ షాపుల్లోనేగాక హోల్ సేల్ మార్కెట్‌లోనూ మాస్క్​లు, శానిటైజర్ల కొరత వెంటాడుతోంది. మాస్క్​లకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం, ఆ స్థాయిలో దిగుమతి లేకపోవడంతో వ్యాపారులు చెప్పిందే రేటు అన్న చందంగా మారింది. సిటీతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కోఠిలోని హోల్ సేల్ మార్కెట్ నుంచే మెడిసిన్స్, సర్జికల్స్ సరఫరా అవుతుంటాయి. రెండు రోజులుగా ఈ హోల్ సేల్ మార్కెట్‌లో 80శాతం బిజినెస్ మాస్క్​లు, శానిటైజర్లదే. సగానికిపైగా హోల్ సేల్ షాపుల్లో మాస్కులు, శానిటైజర్లు స్టాకు లేవనే బోర్డులు కనిపిస్తున్నయి. మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపుల యజమానులతోపాటు సాధారణ ప్రజలు కూడా కోఠికే క్యూ
కడుతున్నారు. రెండు రోజులుగా ఇదే బిజినెస్ నడుస్తోందని, స్టాక్ అయిపోవడంతో ఇండెంట్ పెట్టామని వ్యాపారులు చెప్పారు. మాస్క్​లు ఎక్కువగా అహ్మదాబాద్ నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఇష్టారాజ్యంగా రేట్లు..
గతంలో రూపాయి, రూ.2కు వచ్చే సాధారణ మాస్క్​లు ఇప్పుడు రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతున్నాయి. ఎన్–95 మాస్క్​లు, ఐఎస్ఎస్ బ్రాండ్ ఉన్న మాస్క్​లను రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. బ్యాక్టీరియాను నశింపజేసేందుకు చేతులకు రుద్దుకునే శానిటైజర్ల రేట్లు కూడా అలాగే ఉన్నాయి. 200 మిల్లీ లీటర్లు, 500 మిల్లి లీటర్ల సైజు శానిటైజర్లు రూ.300 నుంచి రూ.500 రేట్లకు అమ్ముతున్నారు.