కాంగ్రెస్​కు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: కేసీఆర్

కాంగ్రెస్​కు 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: కేసీఆర్

 

  • బీఆర్ఎస్ రాకుంటే.. ఫ్రీ కరెంట్​ను  కాంగ్రెస్ కాకి ఎత్తుకపోతది
  • ధరణిని తీసేసి మళ్లీ పాత రాజ్యం తేవాలని చూస్తున్నరు 
  • ఎన్నికలొస్తే ఆగమాగం, గత్తరగత్తర చేస్తరని ఫైర్ 
  • కోస్గి, మహబూబ్​నగర్​, తాండూరు, పరిగిలో సభలు 


రాష్ట్రంలో కాంగ్రెస్​కు 20 సీట్లు కూడా రావని, రేవంత్​రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని సీఎం కేసీఆర్​ అన్నారు. బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోస్గి, మహబూబ్​నగర్​, తాండూరు, పరిగిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్​వాళ్లది ఇప్పుడు కొత్త మాట. 15 మంది మోపైన్రు. ‘నేను సీఎం అయితనంటే నేను సీఎం అయిత’ అంటున్రు. వీళ్లు ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు? కాంగ్రెస్​గెలిస్తే కదా! ఈ ఎన్నికల్లో వాళ్లకు 20 సీట్లు కూడా రావు. రేవంత్​రెడ్డి సీఎం కూడా అయ్యేది లేదు. ఇదంతా గ్యాస్. రేవంత్​ సీఎం అయితడని మీరు మోసపోయి ఓట్లు వేస్తే, కథ మళ్లీ మొదటికి వస్తది’’ అని కేసీఆర్ అన్నారు. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్... ఉన్న తెలంగాణను ఊడగొట్టి గోస పెట్టిందని మండిపడ్డారు.  ‘‘కాంగ్రెసోళ్లు కరువుల కు గురిచేసిన్రు. ఉమ్మడి పాలమూరు జిల్లాను బొంబా యి బస్సులకు ఆలవాలం చేసిన్రు. పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఇస్తామని 2004లో అధికారంలోకి వచ్చి మోసం చేసిన్రు. 33 పార్టీలు మద్దతిస్తే అప్పుడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన్రు” అని చెప్పారు. 

10 హెచ్ పీ మోటార్లు పెడ్తే బిల్లు ఎవరు కడ్తరు?  

రైతుబంధు దుబారా అని ఉత్తమ్ అంటే, వ్యవసా యానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్​ వస్తేనే 24 గంటల ఫ్రీ కరెంటు ఉంటది. లేకుంటే ఫ్రీ కరెం టును కాంగ్రెస్​ కాకి ఎత్తుకపోతది. 3 గంటల కరెంటుతో రైతులు నీళ్లు ఎట్ల పారిస్తారని అంటే.. 10 హెచ్​పీ మోటార్లు పెట్టుకోవాలని కాంగ్రెసోళ్లు చెబుతున్నారు. 10 హెచ్​పీ మోటార్లు రైతులు పెట్టుకుంటరా? ఈ మోటార్లు పెడితే కరెంటు బిల్లులకే రూ.60 వేల కోట్లు కావాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిస్తారు?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్​కు ఫ్రీ కరెంటు ఇవ్వడం చేతకాలేదని.. ఇచ్చేటోళ్లు వస్తే, దాన్ని ఎడమడం చేయాలని చూస్తున్నరని ఫైర్ అయ్యారు. ‘‘ధరణిని బంగా ళాఖా తంలో కలిపేస్తామని కాంగ్రెసోళ్లు ఖుల్లాగా చెబుతున్నారు. ధరణిని తీసేసి భూమాత తీసుకొస్తామని అంటున్నారు. ఈ పోర్టల్​ను తీసేస్తే రైతుబంధు ఎలా ఇస్తారు. మళ్లీ పాత రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైతుల జీవన్మరణ సమస్య” అని అన్నారు.

కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యమే..  

రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళారుల రాజ్యం వస్తుందని విమర్శించారు. ‘‘అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాత పథకం తెస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నరు. కానీ అది భూమేత అయితది. ఇప్పుడు ఎన్ని ఎకరాలున్నా రైతుబంధు ఇస్తున్నం. ధరణి తీసేస్తే రైతుబంధు వస్తదా? ధరణి ఉండాల్నా?  పోవాల్నా? రైతులు ఆలోచించాలి” అని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి కర్ఫ్యూ లు లేవని పేర్కొన్నారు. 

ALSO READ : టీడీపీ ఓట్ల కోసం బీఆర్​ఎస్ ​vs కాంగ్రెస్​.. పచ్చ జెండాలతో పోటాపోటీ ప్రచారం

పార్టీ చరిత్రను చూసి ఓటెయ్యండి.. 

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ఎంపీగా పోటీ చేశానని, తాను ఎంపీగా ఉన్నప్పుడే రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఈ క్రెడిట్ ​పాలమూరుకు శాశ్వతంగా ఉంటుందన్నారు. ‘‘ఎన్నికలు వస్తే ఆగ మాగం, గత్తరగత్తర చేస్తరు. తిమ్మిని బమ్మిని చేయడం, తెల్లారితే పార్టీ మారి టికెట్లు తెచ్చుకోవడం చేస్తున్నారు. పాలమూరు ప్రజలు చైతన్యవంతులు. వీటన్నింటిని గమనించాలి. వచ్చే ఐదేండ్ల కోసం వేసే ఓట్లు.. పాలమూరు నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని,  మీ తలరాతని మారుస్తాయి. లేకుంటే ఇబ్బంది వస్తది” అని అన్నారు. ‘‘అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీని, దాని చరిత్రను చూడాలి. బీఆర్ఎస్​ మీ కండ్ల ముందే పుట్టిన ఈ పార్టీ.. పేగులు తెగే దాకా 15 ఏండ్లు కొట్లాడి.. సమాజాన్ని ఒక్కటి చేసి రాష్ట్రాన్ని  సాధించింది. అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ ​అభ్యర్థులకే ఓట్లు వేసి ఆశీర్వదించండి” అని కోరారు.