టీడీపీ ఓట్ల కోసం బీఆర్​ఎస్ ​vs కాంగ్రెస్​.. పచ్చ జెండాలతో పోటాపోటీ ప్రచారం

టీడీపీ ఓట్ల కోసం  బీఆర్​ఎస్ ​vs కాంగ్రెస్​..  పచ్చ జెండాలతో పోటాపోటీ ప్రచారం

ఖమ్మం, వెలుగు:  టీడీపీ ఓట్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్ఎస్​ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎవరికి వారు టీడీపీ సపోర్టు తమకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఎలాగైనా ఆ పార్టీ క్యాడర్​ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ జెండాలు, కండువాలు మెడలో వేసుకుని మరీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈసారి తెలంగాణలో పోటీ చేయడం లేదని టీడీపీ ప్రకటించింది. ఇదే అదునుగా ఆ పార్టీ మద్దతుదారుల ఓట్లు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో తెలుగుదేశంతో తమకున్న అనుబంధాన్ని, ఆ పార్టీలో పనిచేసిన రోజులను గుర్తుచేస్తున్నారు.

మరికొందరు ఏకంగా టీడీపీ కండువాలను మెడలో వేసుకొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇక ప్రచార ర్యాలీల్లో టీడీపీ జెండాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఏపీని ఆనుకుని ఉండడంతో ఆ ప్రభావం ఇక్కడి రాజకీయాలపై ఎక్కువ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట సెగ్మెంట్లలో టీడీపీ కేడర్ బలంగా ఉంది. సొంతంగా గెలిచేంత బలం లేకపోయినా, ప్రత్యర్థిని ఓడించేందుకు అవసరమైన సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. వారందరినీ తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 

ఆఫ్​ది రికార్డ్ మద్దతు మాకే

తెలంగాణలోని ఏ పార్టీకి టీడీపీ అధినాయకత్వం అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. అయితే టీడీపీ సపోర్టు తమకేనని కాంగ్రెస్​పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్​అభ్యర్థులు పోటాపోటీగా టీడీపీ సపోర్టు తమకేనని ప్రచారం చేసుకుంటున్నారు. ఏకంగా టీడీపీ జెండాలను ప్రచార వాహనాలకు కట్టుకుంటున్నారు.

మెడలో పచ్చ కండువా ఉండేలా చూసుకుంటున్నారు. తరచూ స్థానిక టీడీపీ లీడర్లతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఖమ్మం కాంగ్రెస్​అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల టీడీపీ జిల్లా ఆఫీసుకు వెళ్లి ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని కోరారు. అంతకు ముందు చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంలోనూ టీడీపీ ఆఫీసుకు వెళ్లి సంబురాల్లో పాల్గొన్నారు.

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్​కూడా టీడీపీ మద్దతు తనకేనని చెబుతున్నారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన రోజు సిటీలోని ఎన్టీఆర్​ విగ్రహం వద్ద నిర్వహించిన సంబురాల్లో పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రెగ్యులర్​గా మధిర నియోజకవర్గంలోని టీడీపీ లీడర్లతో సమన్వయ సమావేశాలు పెడుతున్నారు. తన ర్యాలీల్లో టీడీపీ జెండాలు ఉండేలా చూసుకుంటున్నారు. సత్తుపల్లి కాంగ్రెస్​అభ్యర్థి మట్టా రాగమయి కూడా ప్రచారం, ర్యాలీల్లో టీడీపీ జెండాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

పచ్చ జెండాలు ఉండేలా ప్లానింగ్

సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య తాజాగా టీడీపీపై చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ‘టీడీపీని చివరి వరకు కాపాడుకున్న కార్యకర్తను నేను. సత్తుపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లను ఓటును అడిగే హక్కు నాకే ఉంది’ అని సండ్ర అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితంగా ఉండే కొందరు టీడీపీ లీడర్లు సత్తుపల్లిలో సండ్రకు వ్యతిరేకంగా పనిచేస్తుండడంతో, ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మూడు సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి హ్యాట్రిక్ విజయం సాధించిన సండ్ర వెంకట వీరయ్య, 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో, ర్యాలీల్లో గులాబీ జెండాలతోపాటు టీడీపీ జెండాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

ALSO READ : ఒక్క చాన్స్​ అని రిస్క్ ​చేయొద్దు.. వీ6 లీడర్స్​ టైమ్ లో మంత్రి హరీశ్​రావు

మరోవైపు అశ్వారావుపేట కాంగ్రెస్​అభ్యర్థి జారె ఆదినారాయణ కూడా తన ప్రచార వాహనానికి హస్తం గుర్తుతోపాటు టీడీపీ జెండా కట్టుకుని తిరుగుతున్నారు. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు గెలవగా, తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. ప్రస్తుతం అశ్వారావుపేట బీఆర్ఎస్​అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని అభ్యర్థుల గెలుపోటములపై టీడీపీ ప్రభావం గట్టిగా ఉంటుందన్న అంచనాలున్నాయి.