ఒక్క చాన్స్​ అని రిస్క్ ​చేయొద్దు.. వీ6 లీడర్స్​ టైమ్ లో మంత్రి హరీశ్​రావు

ఒక్క చాన్స్​ అని రిస్క్ ​చేయొద్దు.. వీ6 లీడర్స్​ టైమ్ లో మంత్రి హరీశ్​రావు

హైదరాబాద్, వెలుగు:  ‘‘కాంగ్రెస్​వాళ్లు ఒక్క చాన్స్​అంటున్నరు కదా అని ప్రజలు రిస్క్​చేయొద్దు” అని మంత్రి హరీశ్​రావు అన్నారు. తాము డిఫెన్స్​లో లేమని, ప్రజల్లో ఉన్నామని చెప్పారు. ప్రజల మూడ్​ ఏందో తమకు తెలుసని, మూడోసారి గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ‘వీ6’ నిర్వహించిన ‘లీడర్స్​ టైమ్​’లో హరీశ్​ రావు మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలన.. అంతకుముందు పదేండ్ల కాంగ్రెస్​పాలన ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. 

‘‘పక్కనున్న కర్నాటక, మహారాష్ట్రతో పోలిస్తే సాగునీరు, తాగునీరు, విద్యుత్, సంక్షేమం సహా అన్ని రంగాల్లో తెలంగాణ బాగుంది” అని పేర్కొన్నారు. కర్నాటకలో ఐదు గంటల కరెంటే ఇస్తున్నట్లు  ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్పారని, తమ ప్రభుత్వం​24 గంటల కరెంట్​ఇస్తున్నదని అన్నారు. ‘‘కాంగ్రెసోళ్లు ఆఫీస్​లీడర్లు.. వాళ్లు ఫీల్డ్​లో ఉంటే నిజాలేంటో తెలుస్తయ్​. వాళ్లు గాంధీ భవన్​లో ఉంటారు కాబట్టే వాస్తవాలు వాళ్లకు తెలియవు” అని హరీశ్​ విమర్శించారు. ‘‘కాంగ్రెస్​పాలనలో ఎరువులు, విత్తనాల కొరత..  రైతుల ఆత్మహత్యలు ఉండేవి. అప్పుడు ట్రాన్స్​ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం, దొంగరాత్రి కరెంట్, పండిన పంట అమ్ముకునే దిక్కులేని పరిస్థితులు చూసినం. నాటి కాంగ్రెస్​పాలనకు నేటి కేసీఆర్​పాలనకు జమీన్​ఆస్మాన్​ఫరక్​ఉన్నది.. ఇవన్నీ ప్రజల కండ్ల ముందు ఉండగా ఒక్క చాన్స్​అని ఓటు ఏసుడు ఎందుకు? రిస్క్​లో పడుడు ఎందుకు?.. అనే క్లారిటీ ప్రజల్లో ఉంది” అని చెప్పారు. దేశంలో అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందని, మన రాష్ట్రం కన్నా 22 రాష్ట్రాలు అప్పుల్లో ముందున్నాయని అన్నారు. 

ధర్నాలను ప్రభుత్వం అడ్డుకోవడం సాధ్యం కాదు

తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం, హైదరాబాద్​నగరం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని హరీశ్​ చెప్పారు. ‘‘రాష్ట్ర జనాభాలో మూడింట ఒక్క వంతు హైదరాబాద్​లోనే ఉంటుంది.. కేసీఆర్​పాలనలో కరువు లేదు.. కర్ఫ్యూ లేదు.. నగరం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదిది. సినీ నటులు రజనీకాంత్, సన్నిడియోల్​లాంటి వాళ్లు హైదరాబాద్​అభివృద్ధిని పొగుడుతున్నరు. ఒకప్పుడు హైదరాబాద్​అంటే జలమండలి దగ్గర ధర్నాలు, కరెంట్​కోతలు, ఇన్వర్టర్లు, జనరేటర్ల రణగొణ ధ్వనులు వినేవాళ్లం” అని  అన్నారు. 

ధర్నాలను ప్రభుత్వం అడ్డుకోవడం అనేది సాధ్యం కాదని, ఎవరైనా ధర్నా చేస్తే అందులో మంచి ఉంటే దాన్ని ప్రభుత్వం రిసీవ్​చేసుకొని పరిష్కరిస్తేనే రాజకీయాల్లో నిలదొక్కుకోగలం అని చెప్పారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ప్రజలు గుణాత్మక మార్పును చూస్తున్నారని అన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్​వన్​స్థానానికి చేరుకున్నామని చెప్పారు. కర్నాటక నుంచి తెలంగాణకు పైసలు, చీప్​లిక్కర్​తరలిస్తున్నారని, అక్కడి లీడర్లు ఇక్కడికి వచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు. 
 
కరెంట్​ లేదని రైతులెవరైనా ధర్నా చేశారా?

కరెంట్​రావడం లేదని రైతులెవరైనా రాష్ట్రంలో ఎక్కడైనా ధర్నా చేశారా?  సబ్​స్టేషన్లను ముట్టడించారా అని హరీశ్​రావు  ప్రశ్నించారు. అలాంటప్పుడు 24 గంటల కరెంట్​పై కాంగ్రెస్​చేస్తున్నది తప్పుడు ప్రచారమని తేలిపోతుందని అన్నారు. ‘‘నిజంగానే కరెంట్​ఇవ్వకుంటే ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడాలి.. మమ్మల్ని ప్రజలు అడ్డుకునే వారు కదా? కాంగ్రెస్​పాలనలో పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్​దగ్గర ధర్నాలు చేసేవారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్​హాలిడేలు, హైదరాబాద్​లో ఇండ్లకు రోజుకు 6 గంటలు కరెంట్​కోతలు ఉండేవి. కరెంట్​కావాలా.. కాంగ్రెస్​కావాలా అని మేము ప్రజలను అడుగుతూ ప్రచారం చేస్తున్నం. కరెంట్​విషయంలో కాంగ్రెస్​దారుణంగా ఫెయిలైంది. ఆ పార్టీకి అధికా రం ఇస్తే లేని రిస్క్​తెచ్చుకున్నట్టు అవుతుందేమోనని ప్రజలు భయపడుతున్నరు” అని హరీశ్​ పేర్కొన్నారు. కాగా, సిట్టింగ్​ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంలో తప్పేమీ లేదని, తమ ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరగా ఉండి పని చేస్తున్నారని ఆయన తెలిపారు.  

కేంద్ర ప్రభుత్వం నిధులు ఆపింది

తమకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదని హరీశ్​రావు అన్నారు. ‘‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టిన 12 రాష్ట్రాలకు పైసలు ఇచ్చినమని, తెలంగాణలో పెట్టలేదు కాబట్టే ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ​స్వయంగా ఒప్పుకున్నరు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్​లో బోర్లకు మీటర్లు పెట్టి రూ.11వేల కోట్లు, హిమాచల్ ​ప్రదేశ్​ప్రభుత్వం కూడా లోన్లు తీసుకుంది. కర్నాటక ప్రభుత్వం మీటర్లు పెడతామని చెప్పి బడ్జెట్​లో రూ.12 వేల కోట్ల అప్పుతీసుకుంటామని చెప్పింది” అని తెలిపారు. స్వామినాథన్ ​కమిటీ రిపోర్టులను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అమలు చేయలేదని అన్నారు. ఆ రెండు పార్టీలు రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘బీజేపీ కార్పొరేట్ల పార్టీ.. వాళ్లకు లక్షల కోట్లు మాఫీ చేసి పేదలు, రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? కేసీఆర్ సీఎం అయినా ఈ రోజు కూడా వ్యవసాయం చేసే రైతు. అందుకే ఆయనకు రైతుల బాధలేంటో తెలుసు” అని హరీశ్​ అన్నారు. రైతుల రుణాలు రూ. 14 వేల కోట్లు మాఫీ చేశామని, మిగతా రూ.4 వేల కోట్లు మాఫీ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఎలక్షన్​కమిషన్​కు ఇప్పటికే రెండుసార్లు లేఖ రాశామని, వాళ్లు అనుమతిస్తే వెంటనే అమలు చేస్తామని, లేదంటే డిసెంబర్ ​మూడో తేదీ తర్వాత కేసీఆర్ ​మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ వెంటనే రైతురుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. కేంద్రం తెలంగాణకు రావాల్సిన రూ.లక్ష కోట్ల నిధులు ఆపేసిందని, దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. 

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టుడు మా బాధ్యత

ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం తమ బాధ్యత అని హరీశ్​రావు అన్నారు. ‘‘కర్నాటకలో రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీ ఐదు గ్యారంటీలు ఇచ్చారు. వాళ్లను అక్కడి ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఉన్న పథకాలు రద్దయ్యాయి. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది తొమ్మిది గంటల కరెంట్​ఇస్తే కాంగ్రెస్​వచ్చిన తర్వాత మూడు నాలుగు గంటల కరెంట్​కూడా రావడం లేదని అక్కడి రైతులే చెప్తున్నరు. ఎంబీబీఎస్​ సహా ప్రొఫెషనల్​డిగ్రీలు చేసే పిల్లలకు ఇచ్చే స్కాలర్​షిప్పుల్లోనూ 70 నుంచి 80 శాతం కోతలు పెట్టారు. ఎందుకిలా చేస్తున్నరని అడిగితే ఖజానా ఖాళీ అని అక్కడి ప్రభుత్వ పెద్దలే చెప్తున్నరు” అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్​ను నమ్మితే కర్నాటక ప్రజల్లా మోసపోతామని ప్రజలకు చెప్పడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని చెప్పారు. ‘‘అంతిమ నిర్ణేతలు ప్రజలే.. ఉన్న విషయాలు చెప్పడం మాత్రమే మా బాధ్యత” అని అన్నారు. 

ALSO READ : బెదిరింపులు, దాడులు .. బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకు పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

మేం చెప్పింది చేసి తీరుతం

తమ ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చెప్పిందంటే చేసి తీరుతుందని హరీశ్​రావు పేర్కొన్నారు. గత మేనిఫెస్టోలో పెట్టిన స్కీంలలో 80 శాతం అమలు చేశామని, మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ,  కేసీఆర్ ​కిట్, న్యూట్రిషన్​ కిట్​లాంటివెన్నో ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. మ్యాజిక్​ చేస్తే, మంత్రం వేస్తే పంటలు పండవని, నీళ్లు ఇచ్చాం కాబట్టే పంట దిగుబడి పెరిగిందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ ​పాలనలో ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో నిలబడి రైతులు పోలీసులతో లాఠీలు దెబ్బతిన్న రోజుల ను గుర్తు చేసుకోవాలి” అని అన్నారు.