వ్యవసాయ పంపు సెట్లకు నో స్మార్ట్ మీటర్లు... కేంద్రం తెచ్చిన ఆర్డీఎస్ఎస్ లోనూ చేరేలా సర్కార్ ప్లాన్..

వ్యవసాయ పంపు సెట్లకు నో స్మార్ట్ మీటర్లు... కేంద్రం తెచ్చిన ఆర్డీఎస్ఎస్ లోనూ చేరేలా సర్కార్ ప్లాన్..
  • ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం 
  • ముందుగా ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, కమర్షియల్​కే స్మార్ట్ మీటర్లు 
  • గృహ వినియోగంపైనా దశల వారీగా అమలు డిస్కమ్​ల బాకీల 
  • చెల్లింపుల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో చేరాలని నిర్ణయించినప్పటికీ, అన్నదాతల ఉచిత విద్యుత్‌‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఈ ప్లాన్ సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై వచ్చిన తీవ్ర వ్యతిరేకతను ముందే గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యూహాత్మక అడుగు వేసింది. 

వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రక్షిస్తూనే, కేంద్రం నుంచి భారీగా నిధులను రాబట్టుకోవడానికి వీలుగా సరికొత్త కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా రైతుల మోటార్లకు వ్యక్తిగత మీటర్లు కాకుండా, కేవలం సబ్-స్టేషన్ల పరిధిలోని ఫీడర్ల వద్ద మాత్రమే సిస్టమ్ మీటర్లు పెట్టి లోడింగ్ లెక్కలను తేల్చనున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ ప్రజా వ్యతిరేకతకు దారితీయడంతో ఇక్కడ ఆ తప్పులు జరగకుండా సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. 

ఈ నేపథ్యంలోనే స్మార్ట్ మీటర్ల అమలును ఒకేసారి అందరికీ కాకుండా, ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా ప్రవేశపెట్టనుంది. మొదటి విడతలో కేవలం ప్రభుత్వ సంస్థలు,  ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలతో పాటు వాణిజ్య  కనెక్షన్లకే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను పరిమితం చేయనున్నారు. ప్రభుత్వ రంగ ఆఫీసులు, మాల్స్, ఫ్యాక్టరీలలో వీటిని అమర్చడం ద్వారా విద్యుత్ వృథాను అరికట్టడంతో పాటు డిస్కంల ఆదాయాన్ని పెంచుకోవచ్చని భావిస్తున్నారు. 

ఇక  గృహ వినియోగదారుల విషయానికి వస్తే.. మొదటి దశలో ఎక్కువ విద్యుత్ వాడే విలాసవంతమైన భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలకే వీటిని పరిమితం చేసి, సాధారణ, మధ్యతరగతి వారికి అవగాహన కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తున్నది.  

విడతల వారీగా డిస్కంల బాకీల చెల్లింపులు  

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలను పట్టిపీడిస్తున్న భారీ బకాయిల సంక్షోభంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణ డిస్కంలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన నిధులతో పాటు ఇతర రూపాల్లో ఉన్న బకాయిలు దాదాపు రూ. 54 వేల కోట్లకు చేరడం విద్యుత్ రంగానికి పెద్ద భారంగా మారింది. అయితే ఆర్డీఎస్ఎస్ నిబంధనల ప్రకారం కేంద్ర సాయం అందాలంటే డిస్కంల పాత బకాయిలన్నింటినీ విడతల వారీగా చెల్లించాల్సి ఉండటంతో, ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యాచరణను అమల్లోకి తెచ్చింది. ఇంతటి భారీ మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేందుకు వీలుగా పక్కా రోడ్ మ్యాప్ తయారు చేసి, బ్యాంకులు  కేంద్ర ఆర్థిక సంస్థల నుంచి కొత్తగా రుణాలు సేకరించే ప్రక్రియపై దృష్టి పెట్టింది. 

ఒకేసారి ఈ రూ. 54 వేల కోట్ల భారాన్ని తన ప్రత్యక్ష ఖాతాలోకి తీసుకోకుండా, కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు డిస్కంతో అత్యంత వ్యూహాత్మకంగా అప్పుల రీస్ట్రక్చరింగ్‌‌కు తెరలేపింది. ఈ ప్లాన్ ప్రకారం.. అత్యధిక సబ్సిడీ భారం ఉన్న వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ వంటి విభాగాలను, వాటికి సంబంధించిన పాత అప్పులతో సహా పూర్తిగా 'రైతు డిస్కం' పరిధిలోకి చట్టబద్ధంగా బదిలీ చేస్తారు. దీంతో పాత రెండు డిస్కంల (టీజీఎస్పీడీసీఎల్, టీజీఎప్​పీడీసీఎల్) బ్యాలెన్స్ షీట్లు రాత్రికి రాత్రి క్లీన్ అయి, అవి కేవలం గృహ, వాణిజ్య విభాగాల బిల్లింగ్ ద్వారా లాభాల బాట పట్టి, ప్రభుత్వ గ్యారంటీ (ఎఫ్ఆర్​బీఎం) అవసరం లేకుండానే సొంతంగా మార్కెట్ నుంచి లోన్లు పొందే అర్హత సాధిస్తాయి. 

ఇక కేవలం ప్రభుత్వ సబ్సిడీలపైనే నడిచే 'రైతు డిస్కం' అప్పులను ఒకేసారి కాకుండా సుదీర్ఘ కాలపరిమితి గల బాండ్లు, బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ గ్యారెంటీతో కూడిన పీఎఫ్‌‌సీ రుణాల రూపంలోకి మారుస్తూ, వాటి ఈఎంఐలను నేరుగా ప్రభుత్వ బడ్జెట్ ఎస్క్రో ఖాతాకు అనుసంధానిస్తారు. దీనివల్ల కేంద్రం నుంచి వచ్చే ఆర్డీఎస్ఎస్ నిధులకు సైతం టెక్నికల్ అభ్యంతరాలు లేకుండా మార్గం సుగమవుతుందని సెక్రటేరియేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లు ఇలా.. 

డిస్కంల తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం1,90,61,511   యాక్టివ్ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో సింహభాగం గృహ వినియోగదారులవే. వివిధ కేటగిరీల వారీగా చూస్తే గృహ వినియోగ  కనెక్షన్లు అత్యధికంగా 1,37,07,321 (71.9%) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఉచిత విద్యుత్ పొందుతున్న రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ  కనెక్షన్లు 29,14,692 (15.3%) ఉన్నాయి. 

వీటితో పాటు వీధి దీపాలు, ప్రభుత్వ తాగునీటి పథకాలు (మిషన్ భగీరథ/పీడబ్ల్యూఎస్), కుటీర పరిశ్రమలు, ప్రార్థనా మందిరాలతో కూడిన ఇతర  కనెక్షన్లు 22,88,252 (12%) ఉండగా, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, డిస్కంల ఆదాయానికి అత్యంత కీలకమైన పారిశ్రామిక  కనెక్షన్ల సంఖ్య అత్యల్పంగా 1,51,246 (0.8%) మాత్రమే ఉంది. అయితే కనెక్షన్ల పరంగా ఇండ్లకు సంబంధించినవి 71.9 శాతం ఉన్నప్పటికీ, రాష్ట్ర మొత్తం విద్యుత్ వినియోగంలో మాత్రం దాదాపు 45 శాతానికి పైగా వాటా ఉచిత విద్యుత్ సరఫరా పొందుతున్న వ్యవసాయ రంగానిదే ఉన్నది.