అర్నాబ్ డబ్బులు ఇచ్చుంటే నా భర్త బతికేవాడు

అర్నాబ్ డబ్బులు ఇచ్చుంటే నా భర్త బతికేవాడు

ముంబై: ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ మృతి కేసులో ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అన్వయ్ నాయక్‌‌ను సూసైడ్‌‌కు ప్రేరేపించాడని అర్నాబ్‌‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అర్నాబ్ అరెస్ట్‌పై అన్వయ్ కుటుంబీకులు స్పందించారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేసినందుకు మహారాష్ట్ర పోలీసులకు అన్వయ్ నాయక్ భార్య, ఆయన కూతురు థ్యాంక్స్ చెప్పారు. అర్నాబ్‌‌ డబ్బులు ఇవ్వనుందునే తన భర్త చనిపోయారని, బకాయిలు చెల్లిస్తే ఆయన బతికుండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా నాయక్ ఆరోపించారు.

‘ఈ కేసులో 2018 నుంచి ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. నా భర్తతోపాటు అత్తమ్మను నేను కోల్పోయా. సూసైడ్ నోట్‌‌లో నా భర్త ముగ్గురి పేర్లను రాశాడు. రావాల్సిన డబ్బులు ఇచ్చుంటే నా భర్తతోపాటు అత్తమ్మ బతికుండే వారు. ఆయన ఓ కుట్రలో చిక్కుకున్నారు. ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు తిరిగివ్వలేదు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. కొందరు మమ్మల్ని ఫాలో అయ్యారు. మా ఫోన్లను ట్రాప్ చేశారు. నేను ఎంతగానో ప్రేమించే నా భర్త కేసులో న్యాయం జరగడమే నాకు కావాలి’ అని అక్షతా నాయక్ చెప్పారు. అర్నాబ్ గోస్వామికి చెందిన ఏఆర్జీ ఔటలైర్స్ రూ.83 లక్షలు, ఫిరోజో షేక్ చెందిన స్కిమీడియా రూ.4 కోట్లు, నితేశ్ సర్దాకు చెందిన స్మార్ట్ వర్క్ రూ.55 లక్షలు తన భర్తకు బాకీ ఉన్నట్టు ఫిర్యాదులో అక్షత పేర్కొన్నారు.