మథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ సర్వేపై సుప్రీం స్టే

మథురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ సర్వేపై సుప్రీం స్టే

మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ను కోర్టు పర్యవేక్షణలో సర్వే చేసేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే సర్వే వల్ల అసలు విషయం తేలుతుందంటూ హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు అప్పట్లో సర్వేకు అనుమతించింది. తాజాగా ఈ సర్వేను తాత్కాలికంగా నిలిపేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

17వ శతాబ్దం నాటి షాహీ ఈద్గా మసీదులో సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 14, 2023న ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతి ఇచ్చినట్లే ఈసారి షాహీ ఈద్గా మసీదులోనూ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సర్వేను తాత్కాలికంగా నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారని హిందూ సంఘాలు సర్వే చేయాలని పట్టుబడుతున్నాయి. గతంలో ఉన్న కాట్రా కేశవ్ దేవ్ ఆలయాన్ని కూల్చివేసి శతాబ్దాల నాటి మసీదును నిర్మించారని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాయి.