హైదరాబాద్, వెలుగు: నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థల మధ్య చైనా క్యాంపస్ పేరిట భాగస్వామ్యం కుదిరినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ పునీత్ కొత్తప ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ నకిలీ పోస్టర్ను తీవ్రంగా ఖండించారు. ఆ పోస్టర్లోని సమాచారం నిరాధారమైనదని, కల్పితమని ఆయన తెలిపారు.
ప్రస్తుతం గానీ, భవిష్యత్తులో గానీ అలాంటి ఒప్పందం లేదా ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని చెప్పారు. సంస్థ పేరు, లోగో, బ్రాండ్ గుర్తింపును దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ప్రజలు ఎవరూ ఈ మోసపూరిత సమాచారాన్ని నమ్మొద్దని, ఇతరులకు ఫార్వార్డ్ చేయొద్దని పునీత్ కొత్తప కోరారు. ఈ ఫేక్ పోస్టర్ను రూపొందించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.
