317 జీవో బాధితులకు సర్కార్ షాక్

317 జీవో బాధితులకు సర్కార్ షాక్

హైదరాబాద్, వెలుగు: ఊహించినట్టుగానే 317 జీవో బాధిత టీచర్లకు రాష్ట్ర సర్కార్ షాక్ ఇచ్చింది. జీరో సర్వీస్​తో బదిలీలకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. రెండేండ్ల స్టేషన్​ సీనియార్టీ ఉంటేనే ట్రాన్స్​ఫర్లకు అవకాశం ఇస్తామని ప్రకటించింది. గురువారం టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్, గైడ్​లైన్స్​ను సర్కారు రిలీజ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్5 విడుదల చేశారు. మూడు రోజుల కింద బయటకొచ్చిన గైడ్​లైన్స్​, షెడ్యూల్​లోని అంశాలే దాదాపు వాటిలో ఉన్నాయి. రెండేండ్ల సర్వీస్​తోనే బదిలీలు ఉంటాయని డ్రాఫ్ట్ లో ఉండగానే టీచర్స్​ యూనియన్లు దీనిపై ఆందోళనలు చేపట్టాయి. జీరో సర్వీస్​తోనే ట్రాన్స్​ఫర్లు చేపట్టాలని డిమాండ్ చేశాయి.   

9,700 మందికి ప్రమోషన్లు,  40 వేల మంది ట్రాన్స్​ఫర్

టీచర్ల ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి స్టార్ట్​ కానున్నది. మార్చి 3 వరకు కొనసాగుతుంది. 37 రోజుల పాటు జరిగే ఈ ప్రాసెస్​లో సుమారు 9,700 మందికి ప్రమోషన్లు పొందనుండగా, సుమారు 30 వేల నుంచి 40 వేల మంది ట్రాన్స్​ఫర్​కానున్నారు. 27న హెడ్మాస్టర్ల ప్రమోషన్లకు అర్హులైన సీనియార్టీ లిస్టులతో పాటు ఖాళీల వివరాలను అధికారులు ప్రకటిస్తారు. 28 నుంచి 30 వరకు కేవలం మూడు రోజుల్లో టీచర్లంతా ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ హార్డ్​ కాపీలను ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత అధికారులకు అందించాలి. ఫిబ్రవరి 7న డీఈవో, ఆర్జేడీ వెబ్ సైట్లలో సీనియార్టీ లిస్టులు పెడతారు. ఫిబ్రవరి 14న హెడ్మాస్టర్ల బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్​ యథాతథంగా కొనసాగనున్నది. హెడ్​మాస్టర్లకు మల్టీజోన్ స్థాయిలో, టీచర్లకు జిల్లా స్థాయిలో బదిలీలు, ప్రమోషన్లు ఉండనున్నాయి.

జీరో సర్వీస్​తోనే బదిలీలు చేయాలె: సంఘాలు 

సాధారణ బదిలీల్లో జీరో సర్వీసుతో టీచర్లకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఇవ్వాలని టీచర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

లాస్ట్ వర్కింగ్ డే వరకు పాత స్కూల్​లోనే 

ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్​ నుంచి వేరే స్కూల్​కు బదిలీ అయినా.. ప్రమోషన్ పొందినా స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే వరకు పాత స్కూల్​లోనే కొనసాగాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 23న రిలీవ్​అయి, బదిలీ/ప్రమోషన్ పొందిన స్కూల్లో 24న జాయిన్ కావాలని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల స్టేషన్ సీనియారిటీ ఉన్న హెడ్మాస్టర్లు, 8 ఏండ్ల సీనియార్టీ ఉన్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. వాళ్లు  ప్రస్తుతం పనిచేస్తున్న స్కూళ్ల వివరాలను ఖాళీల జాబితాలో చూపించనున్నారు. సీనియారిటీ సర్వీస్ పాయింట్లను 0.041 ప్రతి నెలా యాడ్ కానున్నాయి. గతంలో స్కూళ్లను నాలుగు కేటగిరీలుగా చూపించగా, ఈ ఏడాది హెచ్​ఆర్​ఏకు అనుగుణంగా మూడు కేటగిరీలుగా మార్చారు.