V6 News

ట్రామా కేర్ సెంటర్లు ఏవి?..ప్రాణాల కాపాడుకోవాలంటే పట్నం పోవాల్సిందే 

ట్రామా కేర్ సెంటర్లు ఏవి?..ప్రాణాల కాపాడుకోవాలంటే పట్నం పోవాల్సిందే 
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు 
  • గోల్డెన్​ అవర్​లోనే ఎక్కువ మంది మృత్యువాత  
  • మూడేండ్లలో దాదాపు 5,800 రోడ్డు ప్రమాదాలు
  • గత 15 రోజుల్లో 42 మంది మృతి

నల్గొండ. వెలుగు:  ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ట్రామా కేర్ సెంటర్ లేక ప్రతీ ఏడాది వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవే పై వెహికల్స్ క్షణం తీరిక లేకుండా రాకపోకలు సాగిస్తుంటాయి. మరోవైపు హైదరాబాద్–వరంగల్, నార్కట్​పల్లి–అద్దంకి, హైదరాబాద్–నాగార్జునసాగర్, కోదాడ–జడ్చర్ల, నకిరేకల్–మల్లంపల్లి, సూర్యాపేట-–జనగామ హైవేలు ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లగా, ఈ రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి కృష్ణాజిల్లాలోని చిల్లకల్లు వరకు 182 కిలోమీటర్ల మేర హైదరాబాద్-–విజయవాడ జాతీయ రహదారి విస్తరించింది. కానీ ఇక్కడ ఒక ట్రామా కేర్  సెంటర్​ కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ రహదారిపై 2012 నుంచి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ ట్రామా కేర్ సెంటర్ల ప్రతిపాదనలు మాత్రం కాగితలకే పరిమితం చేస్తున్నారు. 

మూడేండ్లలో 2,800 మంది ప్రాణాలొదిలారు.. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత మూడేండ్లలో దాదాపు 5,800 రోడ్డు ప్రమాదాలు జరగగా, 2,800 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 5,600 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ లోనే 90 శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. గత 15 రోజులలోనే నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 42 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లను ప్రతీ 35 కిలోమీటర్లకు ఒకటి ఏర్పాటు చేయాలి. కానీ వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా కూడా ట్రామా కేర్ సెంటర్లు లేకపోవడం గమనార్హం. 

పట్నం పోవాల్సిందే.. 

దాదాపు 200 కిలోమీటర్ల జాతీయ రహదారి 65పై బ్లాక్ స్పాట్లను గుర్తించగా  దండు మల్కాపురం నుంచి కృష్ణాజిల్లా వరకు డేంజర్ జోన్లలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొర్లపహాడ్, నవాబ్ పేట, పెద్దకాపర్తి యూ జంక్షన్ మేళ్లచెర్వు ప్లై ఓవర్ ముకుందాపురం యూ టర్న్, ఆకుపాముల బైపాస్, కట్టంగూర్ –నల్లగొండ క్రాస్ రోడ్డు, కట్టంగూర్ లోకల్ నల్లబండగూడెం వద్ద రామాపురం క్రాస్ రోడ్డు, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, కోదాడ కట్టకొమ్మగూడెం క్రాస్ రోడ్డు, శ్రీరంగాపురం, దురాజ్ పల్లి క్రాస్ రోడ్డు, కొమరబండ క్రాస్ రోడ్డు లాంటి చోట్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వరంగల్, నాగార్జునసాగర్, అద్దంకి హైవేపైనా ఇదే పరిస్థితి ఉంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా మెరుగైన వైద్యం కావాలంటే హైదరాబాద్ పోవాల్సిందే.

సూర్యాపేట ప్రభుత్వాస్పత్రి,  నల్లగొండ ప్రభుత్వాస్పత్రి,  కామినేని హాస్పిటల్,  భువనగిరి ప్రభుత్వాస్పత్రుల్లో సీరియస్​ కేసుల్లో అందే వైద్య సేవలు అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి క్షతగాత్రులను హైదరాబాద్​ తరలించేందుకు 2 గంటల నుంచి 5 గంటల వరకు పడుతుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.