సెంటర్లకు పోయి టీకాలు లేక వెనుదిరుగుతున్న జనం

సెంటర్లకు పోయి టీకాలు లేక వెనుదిరుగుతున్న జనం
  • వ్యాక్సిన్ ​దొర్కుతలె
  • హైదరాబాద్​ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి
  • మారేడ్​పల్లిలో ఒక్క సెంటర్​కు 2వేల మంది.. తోపులాట 

సికింద్రాబాద్, వెలుగు: రెండు రోజుల కింద మూతపడిన కరోనా టీకా కేంద్రాలు గురువారం తెరుచుకోవడంతో జనం ఒక్కసారిగా పోటెత్తారు. సెంటర్లలో సరిపడా టీకా డోసులు లేక, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి.. వ్యాక్సిన్ ​వేసుకోకుండానే వెనుదిరిగారు. సికింద్రాబాద్ ​మారేడ్‌‌పల్లిలోని మల్టిపర్పస్ ​ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్​ సెంటర్​కు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. జనాలను కంట్రోల్​ చేయలేక జీహెచ్ఎంసీ సిబ్బంది చేతులెత్తేశారు. హాలు లోపల ఉన్న వారు ఎంతకూ బయటకు రాలేదు. బయటి వారిని లోపలికి పంపలేదు. దీంతో గంటల తరబడి నిలబడ్డ జనం టీకా కేంద్రం తలుపులు తోసుకుని లోపలికి వెళ్లారు. ఈ తోపులాటలో వృద్ధులు, మహిళలు కిందపడ్డారు. మహిళలు పెద్దగా అరుస్తూ అధికారులపై విరుచుకుపడ్డారు. క్యూలైన్లు సరిగా లేవని, వచ్చిన వారిని ఇష్టమొచ్చినట్లుగా లోపలికి పంపుతున్నారని, ఉన్న వారు అలాగే క్యూల్లో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి ఎదురుచూసి లోపలికి వెళ్లగా.. వాక్సిన్ ​డోసులు అయిపోయాయి.. తిరిగి మరుసటి రోజు రావాలంటూ సిబ్బంది చేతులెత్తేశారు.

వారంలో ఐదు రోజులు టీకా...
ఆది, బుధవారం తప్ప మిగతా ఐదు రోజులు వ్యాక్సిన్లు వేస్తున్నారు. అయితే గతంలో వందకు పైగా సెంటర్లు అందుబాటులో ఉంటే వాటిని 35 నుంచి 40కి పరిమితం చేశారు. దీనికి తోడు రెండు రోజులుగా టీకాలు స్టాక్​ లేక సెంటర్లు మూసేశారు. గురువారం నగరంలోని 21 సెంటర్లకు కొవిషీల్డ్, 18 సెంటర్లకు కొవాగ్జిన్​ టీకాలు సరఫరా చేశారు. కొవిషీల్డ్​ సరఫరా అయిన కేంద్రాల్లో జనం రద్దీ అంతగా లేకపోగా, కొవాగ్జిన్​ సరఫరా చేసిన చాలా కేంద్రాల్లో జనం కిక్కిరిసిపోయారు. నెల క్రితం చాలా కేంద్రాల్లో అధిక శాతం కొవాగ్జిన్​ టీకాలు వేయడం.. వారి గడువు  పూర్తవడంతో టీకా కేంద్రాలకు చేరుకుంటున్నారు.

నెల రోజులుగా కొరత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో నెల రోజులుగా కొవాగ్జిన్ ​అందుబాటులో లేదు. కొవిషీల్డ్​ వేస్తున్నారు. కొవాగ్జిన్​ రెండో డోసు కోసం ఎదురు చూస్తున్న వారు మారేడ్‌‌పల్లిలోని  టీకా కేంద్రానికి కొవాగ్జిన్ వచ్చినట్టు తెలిసి గురువారం పెద్ద ఎత్తున సెంటర్​కు చేరుకున్నారు. ఈ కేంద్రానికి 800 డోసులు సరఫరా కాగా 2 వేల మంది వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఏయే డోసులు వేస్తున్నారు? ఏ వ్యాక్సిన్ వేస్తున్నారు అనేది కూడా చెప్పలేదు. ఎక్కడా నోటీసు బోర్డులూ పెట్టలేదు. 

నో సోషల్​డిస్టెన్స్​
టీకా కోసం వచ్చిన వారు సామాజిక దూరం పాటించలేదు. సిబ్బంది ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో ఒకరినొకరు తోసుకున్నారు.  గంటల తరబడి క్యూలో నిలబడిన జనం చివరకు తలుపులు తోసుకుని టీకా కేంద్రంలోకి వెళ్లారు. దీంతో  అక్కడ తోపులాట జరిగి చాలా మంది మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు. జనం భారీగా గుమిగూడి సోషల్​డిస్టెన్స్​ఏమాత్రం పాటించలేదు.