ఇంత టార్చర్‌గా ఉన్నావ్ : వీకెండ్ ఆఫీసుకు రాలేదని.. ఉద్యోగిని పీకేసిన స్టార్టప్ కంపెనీ

ఇంత టార్చర్‌గా ఉన్నావ్ : వీకెండ్ ఆఫీసుకు రాలేదని.. ఉద్యోగిని పీకేసిన స్టార్టప్ కంపెనీ

నోయిడాలోని ఒక స్టార్టప్ కంపెనీలో ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో పెరుగుతున్న పని ఒత్తిడి, వర్క్ ప్లేస్ టాక్సిసిటీపై తీవ్రమైన చర్చకు దారితీసింది ఈ అంశం. 12 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక సీనియర్ ఉద్యోగిని జస్ట్ వీకెండ్ పని చేయలేదన్న నెపంతో సంస్థ నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సదరు ఉద్యోగి తన బాధను రెడ్డిట్ వేదికగా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత ఉద్యోగి రెండు నెలల క్రితమే ఈ స్టార్టప్‌లో యూఎస్ ఈ-కామర్స్ ఆపరేషన్స్ విభాగంలో చేరారు. అయితే ఆయన చేరిన నెల రోజులకే అదే స్థాయి హోదాలో మరొకరిని సంస్థ నియమించుకుంది. కొత్తగా వచ్చిన వ్యక్తికి రెండు టీంలను లీడ్ చేసే బాధ్యతను మేనేజ్‌మెంట్ అప్పగించింది. ఆ కొత్త మేనేజర్ వ్యాపార పరిస్థితులతో సంబంధం లేకుండా.. అత్యంత కఠినమైన సేల్స్ టార్గెట్‌లను పెంచడమే కాకుండా, ఉద్యోగులపై మైక్రో మేనేజ్‌మెంట్ చేయడం ప్రారంభించారని బాధితుడు ఆరోపించారు. ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్ల దాకా తీసుకెళ్లినా ఫలితం లేకపోగా.. కొత్త మేనేజర్ నిర్ణయాలనే తాము నమ్ముతామని యాజమాన్యం తేల్చి చెప్పింది.

వరుసగా పని గంటలకు మించి.. మరీ ముఖ్యంగా వారాంతాల్లో కూడా పని చేయాలని కొత్తగా వచ్చిన మేనేజర్ ఒత్తిడి తెచ్చేవాడు. ఒక శనివారం తనకు ఆరోగ్యం బాగోలేదని.. పని చేయలేనని బాధితుడు తన బాస్‌కు సమాచారం అందించారు. అయితే సోమవారం ఆఫీసుకి వెళ్లగానే స్టార్టప్ యాజమాన్యం ఆయనకు షాక్ ఇచ్చింది. పెర్ఫార్మెన్స్ బాగోలేదనే నెపంతో తక్షణమే రాజీనామా చేయాలని.. లేదంటే టెర్మినేట్ చేస్తామని తేల్చి చేప్పేసింది. పైగా ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నారనే కారణం చూపుతూ ఎప్పుడైనా జాబ్ నుంచి తొలగించే అధికారం తమకు ఉంటుందని సంస్థ వాదించింది.

ఈ ఉదంతంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. 12 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని కూడా కేవలం రెండు నెలల్లోనే ప్రొబేషన్ పేరుతో తీసేయడం 'ఆఫీస్ పాలిటిక్స్' కు నిదర్శనమని చాలామంది అభిప్రాయపడ్డారు. కుటుంబ బాధ్యతలు, అద్దె ఇల్లు వంటి ఆర్థిక భారాలు ఉన్నవారు రూల్ బుక్ లేని స్టార్టప్ కంపెనీల్లో చేరడం ప్రమాదకరమని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఇక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడితే ఉద్యోగాల నుండే తీసేసే సంస్కృతి పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థలు లాభాల వేటలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని, వ్యక్తిగత సమయాన్ని గౌరవించడం లేదని ఈ ఘటన మరోసారి నిరూపించింది.