రాజ్యసభకు నామినేషన్లు షురూ

రాజ్యసభకు నామినేషన్లు షురూ
  • రాష్ట్రం నుంచి రెండు సీట్లకు ఎన్నికలు 
  • తొలిరోజు నామినేషన్లు నిల్
  • 2 న రాష్ట్రానికి రాహుల్ రాక
  • మొదటి సీటు అభిషేక్ మను సింఘ్వీకి
  • రెండో సీటుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు?

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నందున అసెంబ్లీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్​గా వ్యవహరిస్తున్నారు. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

వచ్చే నెల 5 వరకు నామినేషన్ల గడువు ఉంది. రెండు సీట్లకు వచ్చే నెల 2 తర్వాతనే కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వచ్చే నెల 2న వికారాబాద్​లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నందున.. అదే రోజు ఆయనతో దీనిపై చర్చించి, ఆ రెండు పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు రాజ్యసభ సీట్లలో మొదటి సీటు తిరిగి సిట్టింగ్ సభ్యుడైన అభిషేక్ మను సింఘ్వీకే హైకమాండ్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండో సీటుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరునే హైకమాండ్ ఫైనల్ చేయనున్నట్లు పేర్కొంటున్నాయి. 

రెండూ కాంగ్రెస్​ ఖాతాలోకే!

అసెంబ్లీలో ఉన్న 117 మంది ఎమ్మెల్యేలంతా రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు హాజరైతే ఒక్కో అభ్యర్థికి 40 ఓట్లు రావాలి. ఖాళీ అయిన రెండు సీట్లను కాంగ్రెస్​ గెలుచుకోవాలంటే 80 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్​కు సీపీఐతో కలిసి 67 మంది సంఖ్యా బలం ఉండగా, ఎంఐఎం మద్దతిస్తే ఈ బలం 74కు చేరుతుంది. వీరితో పాటు బీఆర్ఎస్​ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది మద్దతిస్తే కాంగ్రెస్​ రెండు సీట్లు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో 27 మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్ఎస్ కు ఏ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం లేనందున అభ్యర్థిని నిలపకపోవచ్చని తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో విప్ లేకపోవడం బీఆర్ఎస్​కు మైనస్​గా మారింది.