నామినేషన్లకు సమ్మక్క తల్లి సెంటిమెంట్..

నామినేషన్లకు  సమ్మక్క తల్లి సెంటిమెంట్..
  • అమ్మవారు ఆగమనం అయిన రెండో రోజు భారీగా దాఖలు
  • ఒక్కరోజే 681 నామినేషన్లు వేసిన అభ్యర్థులు
  • నేటితో ముగియనున్న గడువు

హనుమకొండ/ మహబూబాబాద్/ జనగామ, వెలుగు:  ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. మొదటి రోజు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలవగా, కొన్నిచోట్ల వార్డులకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. కానీ చాలామంది అభ్యర్థులు మేడారం సమ్మక్క ఆగమనాన్ని సెంటిమెంట్ గా భావించి, గురువారం పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో సందడి కనిపించింది. కాగా, శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో చివరిరోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది.

సమ్మక్క సెంటిమెంట్ తో రెండో రోజు జోరు.. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో మొదటి రోజు 49 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, గురువారం మేడారం సమ్మక్క ఆగమనాన్ని చాలామంది సెంటిమెంట్ గా భావించారు. దీంతో జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో జోరుగా నామినేషన్లు వేశారు. ఈ ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మొత్తంగా 681 దాఖలయ్యాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 103 నామినేషన్లు దాఖలవగా, అత్యల్పంగా భూపాలపల్లిలో 30 వార్డులకు 20 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 

ఇక పరకాల మున్సిపాలిటీలో 39, జనగామ 87, స్టేషన్ ఘన్ పూర్ 59, వర్ధన్నపేట 32, నర్సంపేట 89, ములుగు 61, తొర్రూరు 51, కేసముద్రం 57, డోర్నకల్ 49, మరిపెడలో 34 నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు అభ్యర్థులు 49 నామినేషన్లు వేయగా, ఇప్పటివరకు మొత్తంగా 730 నామినేషన్లు దాఖలయ్యాయి. 

పర్యవేక్షించిన ఆఫీసర్లు..

నామినేషన్ల ప్రక్రియను గురువారం పరకాల మున్సిపాలిటీలో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి శివ కుమార్ నాయుడుని నియమించగా,  ఆయన కలెక్టర్ తో సమావేశమై పలు అంశాలు చర్చించారు. మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన నామినేషన్​ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్, వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని కేంద్రాలను ఎన్నికల పరిశీలన ఆఫీసర్​ శివ కుమార్, వరంగల్ అడిషనల్ కలెక్టర్  సంధ్యారాణి పరిశీలించారు. 

 జ‌న‌గామ మున్సిప‌ల్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన నామినేష‌న్ కేంద్రాల‌ను కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, అభ్యర్థులు దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రాల‌ను, సంబంధిత రిజిస్టర్లను క్షుణ్ణంగా ప‌రిశీలించి, ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు.

నేడే ఆఖరు తేదీ..

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. కొన్నిచోట్ల పార్టీ టికెట్లు ప్రకటించక కొంతమంది నామినేషన్ల వేయకపోగా, ఇంకొంతమంది సమ్మక్క దర్శనాన్ని సెంటిమెంట్ గా భావించి ఆగిపోయారు. చివరి తేదీ కావడంతో శుక్రవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం 31న స్క్రూటినీ చేస్తారు. ఫిబ్రవరి 1న అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఆ తర్వాత 2న అభ్యంతరాల పరిష్కారం, 3న నామినేషన్ విత్ డ్రాలకు ఛాన్స్ ఇస్తారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను వెలువరిస్తారు. 

ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల వివరాలు..


మున్సిపాలిటీ    వార్డులు    నామినేషన్లు
పరకాల    22    44
వర్ధన్నపేట    12    35
నర్సంపేట    30    100
జనగామ    30    95
స్టేషన్ ఘన్ పూర్    18    60
ములుగు    20    65
భూపాలపల్లి    30    24
మహబూబాబాద్    36    113
తొర్రూరు    16    51
కేసముద్రం    16    57
డోర్నకల్    15    50
మరిపెడ    15    36
మొత్తం    260    730