బండి సంజయ్‌‌‌‌, ఉత్తమ్‌‌‌‌పై నాన్‌‌‌‌ బెయిలబుల్ వారెంట్లు

బండి సంజయ్‌‌‌‌, ఉత్తమ్‌‌‌‌పై నాన్‌‌‌‌ బెయిలబుల్ వారెంట్లు
  • పిటిషన్లు డిస్మిస్‌‌‌‌ చేసి ఎన్‌‌‌‌బీడబ్ల్యూ జారీ చేసిన ప్రజాప్రతినిధుల స్పెషల్‌‌‌‌ కోర్టు

హైదరాబాద్‌‌‌‌ / బషీర్​బాగ్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ‌‌‌‌రెడ్డిపై నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ వారెంట్లు జారీ అయ్యాయి. కోర్టు విచారణకు హాజరుకానందున నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల స్పెషల్‌‌‌‌ కోర్టు వారెంట్లు జారీ చేసింది. ఇందులో మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌‌‌‌లో నమోదైన కేసులో బండి సంజయ్ ప్రధాన నిందితుడు (ఏ1) గా ఉన్నారు. బండి సంజయ్‌‌‌‌తో పాటు అమరావతి సైదులు, మట్టపల్లి సైదులు సహా మొత్తం ఏడుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. గతేడాది మార్చిలో మొదటి విచారణ ప్రారంభం అయ్యింది. వరుసగా విచారణకు హాజరు కాకపోవడంతో ఎన్‌‌‌‌బీడబ్ల్యూ జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13 వ తేదీకి వాయిదా వేసింది. 

ఉత్తమ్‌‌‌‌పై  వారెంట్‌‌‌‌, సీతక్క వారెంట్ రీకాల్‌‌‌‌

2023 ఎన్నికల సమయంలో ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదయింది. ఈ కేసులో 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 6 నుంచి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ ప్రారంభించింది. ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున రెండు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశిస్తూ  ఈ ఏడాది మే 15న ఉత్తర్వులు జారీ చేసింది.  ఆ తరువాతి రెండు వాయిదాలకు కూడా ఉత్తమ్‌‌‌‌ కుమార్ రెడ్డి హాజరుకాకపోవడంతో పాటు ష్యూరిటీలు సమర్పించలేదు. ఈ క్రమంలోనే గురువారం విచారణలో ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి గైర్హాజరుపై ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కోర్టు డిస్మిస్ చేసింది. నాన్‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌ వారెంట్‌‌‌‌ జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్‌‌‌‌ 8వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మంత్రి సీతక్క తనపై జారీ అయిన ఎన్‌‌‌‌బీడబ్ల్యూను రీకాల్‌‌‌‌ చేయించుకున్నారు.

ప్రజల పక్షాన కొట్లాడినందుకు కేసు పెట్టిన్రు: మంత్రి సీతక్క

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన కొట్లాడిన తమపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మంత్రి సీతక్క గుర్తుచేశారు. 2021లో నమోదైన కేసులో గురువారం సీతక్క నాంపల్లిలోని కోర్టులో హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కరోనా టైంలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని అప్పటి ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్.. ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేసినందుకు అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రజల పక్షాన తాము ఆందోళన చేస్తే , కరోనా వ్యాప్తి చేస్తున్నామని కేసులు ఫైల్‌‌‌‌‌‌‌‌ చేశారని గుర్తుచేశారు. ఈ కేసులో రూ.10 వేలతో రెండు షూరిటీలను కోర్టుకు సమర్పించారు. మంత్రితో పాటు ఎన్ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ నాయకులు న్యాయస్థానం ముందు హాజరయ్యారు.