నవీపేట్, వెలుగు: స్థానిక సర్టిఫికెట్లతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఆర్మీ పోస్టులకు ఎంపికైన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నారాయణపూర్, నిజామాబాద్ మండలం పాల్డ గ్రామాలకు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తులు రెండు మూడేళ్ల క్రితం కూలీ పనుల కోసం వలస వచ్చారు. స్థానికులతో పరిచయాలు పెంచుకొని ఆధార్ కార్డుల్లో మార్పులు చేసి, రెవెన్యూ అధికారుల ద్వారా స్థానిక సర్టిఫికెట్లు పొందారు.
ఈ సర్టిఫికెట్ల ఆధారంగా తెలంగాణ కోటాలో ఆరుగురు వ్యక్తులు ఆర్మీలో దరఖాస్తు చేసి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆర్మీ అధికారులు స్థానిక స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నారాయణపూర్, పాల్డ గ్రామాలకు వెళ్లి విచారణ జరపగా, వారు స్థానికులు కాదని, ఇతర రాష్ట్రాలకు చెందినవారని గుర్తించారు. ఆధార్ కార్డుల్లో మార్పులు చేసి రెవెన్యూ అధికారుల ద్వారా కులం, నివాసం వంటి సర్టిఫికెట్లు పొందినట్లు నిర్ధారించారు. దీంతో వారి ఎంపికలను ఆర్మీ అధికారులు తిరస్కరించారు. స్థానిక తహసీల్దార్ వెంకటరమణను వివరణ కోరగా, తప్పుడు ఆధార్ వివరాలతో సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించి వాటిని రద్దు చేసినట్లు తెలిపారు.
