
50 ఏళ్లలో 300 కోట్లు గాయబ్
ఎక్కువగా గడ్డి భూముల్లోనివే
మనుషుల పనులే కారణమా?
ఉత్తర అమెరికాలో పక్షులు తగ్గిపోతున్నాయి. 1970 నుంచి ఇప్పటివరకు 29 శాతం కనిపించకుండా పోయాయి. ఈ 50 ఏళ్లలో 300 కోట్ల పక్షులు చనిపోయాయి. అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆరో మాస్ ఎక్స్‌టింక్షన్ ముంచుకొస్తోందని పర్యావరణవేత్తలు హెచ్చరించడంతో యూఎస్, కెనడాల్లో ఏబీసీ ఈ సర్వే చేసింది. పిచ్చుకల దగ్గర్నుంచి పెద్ద పెద్ద రాబందుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా రాలిపోతున్నాయని సర్వే చెప్పింది. ప్రమాదం అంచున ఉన్న, సంఖ్య తక్కువగా ఉన్న పక్షుల సంఖ్యనే తగ్గుతోందని గతంలో అనుకున్నామని, కానీ సాధారణ పక్షులు కూడా తగ్గిపోతున్నాయని సర్వే లీడ్ ఆథర్ కెన్ రోసెన్‌బర్గ్ చెప్పారు. చనిపోయిన 300 కోట్ల పక్షుల్లో 90 శాతం 12 జాతులకు చెందినవే అన్నారు. వీటిల్లో ముఖ్యంగా పిచ్చుకలు, వార్బ్‌లర్స్, ఫిన్‌చెస్, స్వాలోస్ ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో, ఫుడ్ సైకిల్‌లో ముఖ్యమైన పని చేస్తుంటాయని వివరించారు. గడ్డి భూముల్లో ఉన్న పక్షులు 53 శాతం నశించిపోయాయని, 1970 నుంచి సుమారు 72 కోట్లు కనిపించకుండా పోయాయని చెప్పారు. తీరం వెంబడి ఉండే పక్షుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గిందన్నారు. వసంత కాలంలో వచ్చే పక్షుల సంఖ్య 14 శాతం తగ్గిపోయిందని వెల్లడించారు.
కారణాలైతే తెలియదు
పక్షులు అంతలా ఎందుకు అంతరిస్తున్నాయో తెలియదని, వాటి సంఖ్య తగ్గిపోయిన విషయం మాత్రం నిజమని సైంటిస్టులు చెప్పారు. వాటి నివాస ప్రాంతాలు కుచించుకుపోవడమే సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. అడవులు వ్యవసాయ భూములుగా మారుతుండటం, పట్టణాలు పెరుగుతుండటంతో ఈ పరిస్థితి వస్తోందన్నారు. పర్యావరణ ఆరోగ్యానికి సూచికలు పక్షులు. విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తూ, కీటకాలను తింటూ మొక్కలను కాపాడుతుంటాయి. కానీ మనుషుల పనుల వల్ల విపరీతంగా పెరుగుతున్న కాలుష్యంతో యూఎస్, కెనడాల్లో పక్షులు, జంతువులు ఉండలేని పరిస్థితి వచ్చిందని సైంటిస్టులు అంటున్నారు.