తెలంగాణలో వానలే వానలు.. ఏఏ జిల్లాల్లో తాజా పరిస్థితి ఎలా ఉందంటే..

తెలంగాణలో వానలే వానలు.. ఏఏ జిల్లాల్లో తాజా పరిస్థితి ఎలా ఉందంటే..

హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు కొత్తగూడ మండలం జలదిగ్బధంలో చిక్కుకుపోయింది. కొత్తగూడ మండల కేంద్రంలో గుంజేడు వాగు ఉధృతి ఆందోళనకరంగా ఉంది. మొన్న రాత్రి ఇదే వాగులో కొట్టుకపోయిన ఇద్దరు వ్యక్తుల గల్లంతయ్యారు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. వాట్వాయి గ్రామ శివారులోని రెణ్యా తండాలో వరద నీరు ఇళ్లలోకి చేరింది.

బురకపెల్లి వాగు, రాళ్ళుతట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తగూడ, ఇల్లెందు మధ్య రాకపోకలు బంద్ కావడం గమనార్హం. కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాగుల దగ్గర గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. గంగారం మండలం ఇల్లెందు వైపు వెళ్లే  ప్రధాన రహదారిపై  మడగూడెం సమీపంలో పెద్ద చెట్టు పడిపోయింది. దీంతో.. పలు గ్రామాల మధ్య రాకపోకలుకు అంతరాయం ఏర్పడింది.  గంగారం ఎస్ ఐ రవి కుమార్, పోలీస్ సిబ్బంది కలిసి రోడ్డుపై పడిపోయిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కుండపోత వర్షం కురిసింది. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీ నీట మునిగింది. ఇళ్లు జల దిగ్భంధంలో చిక్కుకుపోయాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామ సమీపంలో ఉన్న మోతుల కుంటకు గండి పడింది. పంట పొలాల మీదుగా వరద నీరు పారుతోంది. 

Also read:-ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరేడిగోండ, సోనాల మండలాలలో శనివారం వేకువజాము నుంచి కుంభవృష్టి వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బోథ్ పెద్దవాగు, సిరికొండ చిక్మాన్ వాగు, కడెం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దవాగు వరదనీరు ధన్నూర్ గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో.. ఈ గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇచ్చోడలో పలు కాలనీలు నీట మునిగాయి.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి కురిసిన వర్షానికి రోడ్లు నదులను తలపించాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మద్నూర్, గాంధారి మండలాల్లో 9 సెంటీమీటర్లు వర్షపాతం, నిజాంసాగర్ 7, సదాశివనగర్, తాడ్వాయిలో 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సోమూర్ పెద్ద వాగు పొంగి పొర్లుతుండటంతో సోమూర్--అనంతపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర జలపాతంలోకి భారీగా వరద నీరు చేరి జలపాతం ఉగ్రరూపం దాల్చింది. దీంతో.. పర్యాటకులను అటవీ అధికారుల జలపాతం దగ్గరికి అనుమతించడం లేదు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కురుస్తూనే ఉంది. భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. జగిత్యాల జిల్లాలో శనివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతూనే ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతో జగిత్యాల టౌన్ రోడ్లు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.