ఓస్లో: నార్వే చెస్ 2026 టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్లు ఆర్. ప్రజ్ఞానంద, డి. గుకేష్, దివ్య దేశ్‌ముఖ్ అదరగొడుతున్నారు. మంగళవారం (జూన్ 2) ఓస్లోలో జరిగిన 7వ రౌండ్‌లో ముగ్గురు సంచలన విజయాలు నమోదు చేశారు. అంతకుముందు 6వ రౌండ్‌లో ఓటమి పాలైన ఈ అగ్రశ్రేణి త్రయం 7వ రౌండ్‌లో సూపర్ కంబ్యాక్‌తో గెలుపొందారు. తద్వారా టైటిల్ రేసులో మరో అడుగు ముందుకు వేశారు.
ఆర్ ప్రజ్ఞానంద భారీ విజయం
7వ రౌండ్‌లో ఫ్రాన్స్ క్రీడాకారుడు ఆలిరెజా ఫిరౌజ్జాను ప్రజ్ఞానంద చిత్తు చేశాడు. తెల్లపావులతో ఆటమొదలుపెట్టిన భారత గ్రాండ్ మాస్టర్ సుదీర్ఘమైన, క్లిష్టమైన పోరాటంలో చివరి వరకు ఆత్మవిశ్వాసంతో ఆడి అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 9 స్కోర్‌తో మూడో స్థానానికి చేరుకున్న ప్రజ్ఞానంద టైటిల్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాడు.
గుకేష్ సడన్-డెత్ గెలుపు
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ గుకేష్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. 4వ రౌండ్‌లో మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో క్లాసికల్ ఓటమిని చవిచూశాడు గుకేష్. ఈ ఓటమి నుంచి తేరుకుని 5వ రౌండ్‌లో ప్రజ్ఞానందపై కేవలం ఒకే ఒక్క క్లాసికల్ విజయాన్ని మాత్రమే సాధించాడు. ఇక, 7వ రౌండ్‌లో నార్వే చెస్ నాయకుడైన వెస్లీ సోతో జరిగిన పోరులో భారత గ్రాండ్‌మాస్టర్ విజయం సాధించారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠభరితమైన క్లాసికల్ పోరు డ్రాగా ముగిసింది. దీంతో సడన్ డెత్ ఆర్మాగెడాన్ గేమ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సత్తా చాటి చివరికి విజయం సాధించారు.
హంపిని ఓడించిన దివ్య
భారత యువ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ ఆల్-ఇండియన్ క్లాష్‌లో అద్భుత విజయం సాధించింది. భారత దిగ్గజం కోనేరు హంపిని చిత్తు చేసింది. భారతీయ క్రీడాకారిణుల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో మ్యాచ్ ఆర్మాగెడాన్ డిసైడర్‌కు దారితీసింది.
నల్ల పావులతో ఆడిన దివ్య, టైబ్రేకర్‌లో నిలదొక్కుకుని విజయం సాధించగా.. హంపీ క్లాసికల్ డ్రాతో ఒకే ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దివ్య స్థానాన్ని గణనీయంగా మెరుగుపడింది. 10 పాయింట్లతో రెండవ స్థానానికి చేరుకుంది దివ్య దేశ్‌ముఖ్. మరో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కేవలం ఒకే పాయింట్‌తో చివరి స్థానంలో కొనసాగుతోంది.
